కన్నడ నటుడు , మాజీ కేంద్ర మంత్రి అంబరీష్ మృత దేహం దగ్గర నటుడు మోహన్ బాబు హృదయం ద్రవించేలా విలపించడం చాలా మందికి ఆశ్చర్యంగానూ , కొంత మందికి వింతగానూ అనిపించి ఉండవచ్చు . కానీ మోహన్ బాబు నటుడే కానీ నిజ జీవితంలో నటించే తత్త్వం కలవాడు కాదు .
మోహన్ బాబు స్నేహ హస్తం అందించాడంటే అది ఎప్పటికీ వీడిపోదు . మోహన్ బాబు తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ను ఎంత అభిమానిస్తాడో , అంతే ఆత్మీయంగా భావిస్తాడు . రజనీకాంత్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తాజ్ బంజారాలో దిగేవాడు . పగలంతా రజనీ మోహన్ బాబు ఇంట్లోనే ఉండేవాడు . ఆయనకు ఎం కావాలన్నా మోహన్ బాబు సతీమణి నిర్మల వండి పెట్టేది . ఇక మోహన్ బాబు ,రజనీ ఎరా అంటే ఎరా అని పిలుచుకుంటారు . అంటే వారెంత సన్నిహిత మిత్రులో దీనిబట్టి అర్ధం చేసుకోవచ్చు . ఈ స్నేహం వల్లనే మోహన్ బాబు కష్టాల్లో వున్నప్పుడు పెద రాయుడు సినిమాల రజనీ కాంత్ అతిధి పాత్రలో నటించాడు .
కన్నడ సినిమా రంగంలో మోహన్ బాబుకు వున్న అత్యంత ఆప్తుడు ,మంచి మిత్రుడు అంబరీష్ . వీరిద్దరి మధ్య ఈ స్నేహానిది మూడున్నర దశాబ్దాల కాలం . మోహన్ బాబు ఎప్పుడు బెంగళూరు వెళ్లినా అంబరీష్ తోనే ఉండేవాడు . అలాగే మోహన్ బాబు అంబరీష్ ను ఎప్పుడు ఆహ్వానించినా తన శ్రీమతి సుమలత తో వచ్చేవాడు . మోహన్ బాబును ఎరా అనేవాడు , మోహన్ బాబు కూడా ఒరే అని పిలిచేవాడు . ఇద్దరిమధ్య విడతీయలేని గాడానుబంధం వుంది .
నిజానికి మోహన్ బాబు పద్ధతులు అంబరీష్ పద్ధతులు భిన్నంగా ఉండేవి . అయినా వారి స్నేహానికి అవి ఎప్పుడు అడ్డు రాలేదు . మోహన్ బాబు కుటుంబంతో అంబరీష్ కుటుంబ మైత్రి గాఢంగా ఉండేది . అందుకే అంబరీష్ చనిపోయాడని వినగానే మోహన్ బాబు, శ్రీమతి నిర్మల, విష్ణు, లక్ష్మి బెంగళూరు వెళ్లారు . అంబరీష్ పార్ధీవ దేహాన్ని చూడగానే మోహన్ బాబు , నిర్మల , లక్ష్మి బోరున విలపించారు . చూసేవారిని కూడా ఎంతో కలసి వేసింది . ఒక ఆప్త మిత్రుడిని కోల్పోయానన్న బాధ కనిపించింది.
మోహన్ బాబు కు అంబరీష అంటే ఎంత ఇష్టమో ఆ దృశ్యం చూసిన వారికి అర్ధమైంది . సినిమా వారు కూడా మనుషులే , వారికి మనసు ఉంటుంది . ప్రాణమిచ్చే స్నేహితులు వుంటారు అని చెప్పడాన్ని నిదర్శనం ఈ ఘటన .