మెగా ఫ్యాన్స్ కోసమే ఈ బర్త్ డే ఈవెంట్
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఈవెంట్ నేటి సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో వేలాది మెగా ఫ్యాన్స్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొనగా.. అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, డా.కె.వెంకటేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు, అమెరికా ఎన్నారై.. మెగా బ్లడ్ డ్రైవ్ నిర్వాహకుడు నటరాజ్, కాసర్ల శ్యామ్, గాయని మంగ్లీ తదితరులు పాల్గొన్నారు.
ఈ వేదికను పూర్తిగా ఫ్యాన్స్ ఈవెంట్ గా ప్లాన్ చేయడమే గాక కేలం అభిమానులతో కొన్ని కార్యక్రమాల్ని రూపొందించడం ఆసక్తి ని కలిగించింది. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్పెషల్ ఈవెంట్ కోసం అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చాయి. దీంతో వేదిక వద్ద చిన్నపాటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ వేదికపై మెగా డిస్ట్రిబ్యూటర్లు సహా పలువురు ప్రముఖుల్ని సత్కరించారు. ఔట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ వేణుకుమార్, మహర్షి, ఉజ్వల్, శంకర్ రెడ్డి, సి.నాయుడు, అనీల్ కుమార్, సంపత్ కుమార్, నల్లా సూర్య ప్రకాష్ తదితర అభిమానులకు ప్రత్యేకించి మెగాస్టార్ ముఖచిత్రంతో కూడుకున్న మొమెంటోలను అందించారు. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలు చేపడుతున్న ప్రముఖులు ఈ వేదిక వద్దకు అటెండయ్యారు.
వేదిక వద్ద ఉన్న వేలాది అభిమానుల కోసం ప్రత్యేకించి డ్యాన్సులు, పాటల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ అండ్ గాయనీగాయకుల టీమ్ చిరు క్లాసిక్ మెడ్లీ పాటలతో మైమరిపించారు. జబర్థస్త్ టీమ్ సరదా పార్టిసిపేషన్ ఆకట్టుకుంది. ముఠా మేస్త్రి ల్యాండ్ మార్క్ స్టెప్పులతో జబర్థస్త్ కమెడియన్లు ఆకట్టుకున్నారు. సత్య మాస్టార్ మెడ్లీ డ్యాన్స్ పెర్ఫామెన్స్ మైమరిపించింది. ఇక ఈ వేదికపై నిర్మాత కం ఎగ్జిబిటర్ పంపిణీదారుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ చేతులమీదుగా 10వ తరగతిలో మంచి మార్కులు పొందిన విద్యార్థులను సన్మానించారు. ఇకపోతే ఈ వేదిక ఆద్యంతం `సైరా` ఎల్ఈడీ డిస్ ప్లే హైలైట్ గా నిలిచింది. మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ-“లాంగ్ లివ్ చిరంజీవి గారు.. జై సైరా నరసింహారెడ్డి“ అని అన్నారు. అయితే ఈ వేదిక వద్దకు చాలా సేపటి వరకూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విచ్చేయకపోవడంతో ఎదురు చూపులతో అభిమానులు నిరాశకు గురయ్యారు.