ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం కరెక్ట్ కాదట
ప్రస్తుత మహమ్మారీ లాక్ డౌన్ సమయంలో ఒక్కొక్కరూ ఒక్కోలా టైమ్ స్పెండ్ చేశారు. టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో ఇంటరాక్ట్ కావడానికి ‘లాక్ అప్ విత్ లక్ష్మి మంచు’ అనే షోను ప్రారంభించారు.
వైఫ్ ఆఫ్ రామ్‌లో చివరిసారి కనిపించిన మంచు లక్ష్మి సినిమాలు OTT ప్లాట్‌ఫామ్‌ల కోసం స్క్రిప్ట్‌ల వేటలో ఉన్నారట. “W / O రామ్ తరువాత, నేను ఒక తమిళ చిత్రం చేసాను. నేను పొందుతున్న ఆఫర్‌లలో 90% విలన్ పాత్రలు. నేను నిజంగా అన్ని రకాల పాత్రల కోసం ఓపెన్‌గానే ఉన్నాను. కాస్త ఆలస్యమైనా కేవలం మంచి స్క్రిప్ట్‌ల కోసం చూస్తున్నాను“ అని లక్ష్మి చెప్పారు.
స్కూల్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులపై దర్శకుడు క్రిష్‌తో మంచు లక్ష్మి ఈ చిట్ చాట్ లో వాగ్వాదానికి దిగారు. ఆమె దీనిపై స్పష్టం చేస్తూ, “ప్రైవేట్ పాఠశాలలు కనీసం ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నాయి. కానీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల గురించి నేను నిజంగా ఆందోళన చెందుతున్నాను“ అనడం చర్చనీయాంశమైంది.
అంతేకాదు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమానికి తాను పూర్తిగా వ్యతిరేకం అని ఆమె పేర్కొంది. “అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా పరిచయం చేయాలనే ఆలోచన నాకు నచ్చలేదు. నా అభిప్రాయం ప్రకారం, చాలా మంది ఉపాధ్యాయులకు ప్రాథమిక విషయాలు కూడా తెలియదు. విద్యావేత్తగా నేను ఇంగ్లీషు మాత్రమేనని భావిస్తున్నాను“ అని లక్ష్మీ తన అభిప్రాయం చెప్పారు.
మంచు కుటుంబానికి చెందిన తిరుపతి శ్రీవిద్యానికేతన్ కి గత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్కాలర్ షిప్ లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన క్రమంలో ఆ కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. జగన్ కి మంచు మోహన్ బాబు మద్ధతుగా నిలిచారు. అయితే ప్రయివేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనుకున్న సీఎం జగన్ ని మంచు లక్ష్మి వ్యతిరేకిస్తుండడమే ఆశ్చర్యం కలిగిస్తోందని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.