ఇప్పుడు తెలుగు మీడియంలో చదవాలని ఎవరు మాత్రం అనుకుంటున్నారు.? ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఇది నిష్టుర సత్యం.! తెలుగు మీడియంలో చదవడానికి ఎవరూ ఇష్టపడటంలేదు కాబట్టి, పూర్తిగా తెలుగు మీడియంని తొలగించాలనుకోవడం కూడా మూర్ఖత్వమే. కాకపోతే, తక్కువ మంది చదివే తెలుగు మీడియం కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడం ప్రభుత్వాలకీ కష్టసాధ్యమైన వ్యవహారం.
ఇళ్ళల్లో పాచి పనులు చేసుకునే పేదలు కూడా, తమ పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవాలనే కోరికతో, ప్రైవేటు స్కూళ్ళను ఆశ్రయిస్తున్నారు. ఆర్థికంగా అది వారికి చాలా కష్టసాధ్యమైన పనిగా మారుతోంది. ఈ నేపథ్యంలో, అమ్మ ఒడి అనే పథకం, విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.
తెలుగు మీడియంకి ప్రాధాన్యత తగ్గించి, ఇంగ్లీషు మీడియంకి ప్రాధాన్యత ఇస్తే, తప్పు పట్టాల్సిన పనిలేదు. పూర్తిగా తెలుగు మీడియంని లేకుండా చేయడమే.. అసలు సమస్య. పైగా, ‘పేదలు తెలుగు మీడియంకే పరిమితమవ్వాలా.? వారు ఇంగ్లీషు మీడియం చదవకూడదా.? తెలుగు మీడియంలోనే పేదలు చదవాలనడం అంటరానితనం కిందకే వస్తుంది..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంచుతున్న ఉపన్యాసాలు వివాదాస్పదమవుతున్నాయి.
అసలు ముఖ్యమంత్రికి ఈ తరహా ప్రసంగాలు రాసిపెడుతున్నదెవరు.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విమర్శించే క్రమంలో, పెళ్ళిళ్ళు.. భార్యల ప్రస్తావన తీసుకురావడం కూడా వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే.
తెలుగు మీడియంలో చదవాలనుకోవడం నేరం కాదు.! మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఇంగ్లీషులో చదవాలనుకోవడం సబబే.! ఇలాంటి విషయాల్లో ‘అంటరానితనం’ లాంటి పెద్ద పదాల ప్రస్తావన అస్సలేమాత్రం సమంజసం కాదు.!