‘సర్కార్‌’ వివాదం రాజీ…తెర వెనక ఏం జరిగింది?!

విజయ్‌ హీరోగా విడుదలైన ‘సర్కార్’ చిత్రం ఎలా ఉందనే దాని కన్నా ..ఆ సినిమాలో సీన్స్ తొలిగించాలంటూ జరుగుతున్న వివాదం మీడియాలో హైలెట్ అయ్యింది. ఏ.ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా చాలా సీన్స్ ఉన్నాయంటూ ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడితో పాటు ‘సర్కార్’ చిత్ర యూనిట్ పై మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో రోజు రోజుకీ వివాదం ముదరటం, ఆందోళనలకు దారి తీస్తూండటంతో.. అనవసరమైన గొడవలు ఎందుకని ఆ సీన్స్ ను తొలగించేందుకు చిత్ర యూనిట్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా రిలీజైన నాటి నుంచీ.. అన్నాడీఎంకే నేతలు షణ్ముగన్‌, కాదంబూర్‌ రాజు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ప్రభుత్వం ఓటర్లకు మిక్సీలు ఇవ్వడం, ప్రజలు ఎన్నికల ప్రచార చిత్రాలను కాల్చివేయడం, అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం..ఈ అంశాలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ పిటిషన్‌ వేశారు.

వాదోపవాదాలు విన్న న్యాయస్థానం సన్నివేశాలను తొలగించాలని తీర్పు వెలువరించినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో ప్రక్క ఈ నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్‌ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఏదేమైనా ఇప్పుడు రాజీకి వచ్చారు కాబట్టి సమస్య సమిసిపోయినట్లే అంటున్నారు.

వివాదం ఏంటి

ఈ సినిమా ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోండి అని చెప్తూనే రాజకీయ నాయకులకు చురకలు అంటించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రలో జయలలితను ఇండైక్ట్ చూపించారు. అది నెగిటివ్ పాత్ర. అయితే సినిమా టీమ్ ఊహించినట్లుగానే ఆ పాత్ర తమిళనాట బాగానే పట్టింది. జనం అంతా ఆ గెటప్ గురించే మాట్లాడుకుంటున్నారు. దాంతో సమస్య కూడా ఆ పాత్ర తోటే వచ్చి చేరింది.

సర్కార్ సినిమాలో ..జయలలితను తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన సీన్స్ ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారి చేసారు. ఇప్పుడిప్పుడే రాజుకుంటున్న ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించిన ఈ సినిమాకు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించారు.