చైనాలో ‘మహానటి’ …అక్కడ కూడా

అలనాటి ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తీసిన ‘మహానటి’ తెలుగునాట ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. చైనాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న 22వ షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ఈ చిత్రం ఎంపికైంది. ఈ వేడుక జూన్‌ 15 నుంచి 24 వరకు జరగనుంది.

ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ చేశారు. ‘మా సావిత్రి గారిని చైనాకు తీసుకుపోవడం చాలా గౌరవంగా ఉంది. ఆమె అక్కడి ప్రేక్షకుల మనసులు కూడా దోచుకుంటారన్న నమ్మకం నాకు ఉంది’ అని పేర్కొంటూ ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ చేశారు.

ఆస్ట్రేలియాలో జరిగే అతి పెద్ద సినీ వేడుక ‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్బోర్న్‌'(ఐఎఫ్‌ఎఫ్‌ఎం)లో ‘మహానటి’ క్వాలిటీ ఇన్‌ సినిమా’ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ‘ఇండియన్‌ పనోరమా’లో కూడా ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది.

‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటించారు. ఆమె భర్త జెమిని గణేశన్‌ పాత్రను దుల్కర్‌ సల్మాన్‌ పోషించారు. సమంత, విజయ్‌ దేవరకొండ కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందించిన ఈ చిత్రం 2018 మేలో విడుదలై మంచి హిట్‌ అందుకుంది. ప్రత్యేకించి ఇందులో కీర్తి సురేశ్‌ నటనకు ప్రశంసలు లభించాయి.