ఈసారి బడ్జెట్ 1000 కోట్లు మించి!
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్- రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న భారీ చిత్రమిది. 30 జూలై 2020 రిలీజ్ తేదీ ప్రకటించారు కాబట్టి అప్పటికి రాజమౌళి నుంచి మహాభారతం ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
వాస్తవానికి ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి 1,2 చిత్రాలు తెరకెక్కించేప్పుడే మహాభారతం సినిమా చేయాలని ఆలోచన చేశారు. కానీ అనూహ్యంగా బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ `మహాభారతం 3డి` సిరీస్ ని నిర్మిస్తున్నానని ప్రకటించడంతో ఆ ఆలోచనను అప్పటికి వాయిదా వేశారు. ఇప్పుడు అమీర్ మహాభారతం లేదు కాబట్టి రాజమౌళి ప్లాన్స్ లో మార్పు చేసుకున్నారని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ – దగ్గు బాటి రానా- బిగ్ బి అమితాబ్ వంటి స్టార్ల అలయెన్స్ తో మహాభారతం చిత్రాన్ని తెరకెక్కించాలని జక్కన్న భావిస్తున్నారట. ఆర్.ఆర్.ఆర్ తర్వాత భారీ కాన్వాసుపై దీనిని ప్లాన్ చేస్తున్నారని లీక్ అందింది. ఇప్పటికే మహేష్ రాజమౌళికి కమిట్ మెంట్ ఇచ్చారు. అందువల్ల మహాభారతం లో మహేష్ నటించేందుకు ఆస్కారం ఉంది. ఈ సినిమాతోనే హిందీ పరిశ్రమకు ప్రమోట్ అవుతారు మహేష్. యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశం కాబట్టి రాజమౌళి ప్రపోజల్ కి అగ్ర కథానాయకులెవరూ అడ్డు చెప్పరు. అన్ని భాషల్లోనూ నటీనటుల నుంచి సానుకూల ధృక్పథం ఉంటుందనడంలో సందేహం లేదు.
అయితే మహాభారతం ఆలోచనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఎంతో భారీ కాన్వాసుతో సినిమాని తీయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన స్క్రిప్టు పనులు వగైరా చాలా సమయం తీసుకోవాల్సి ఉంటుంది. సాహో రిజల్ట్ ఊహించని విధంగా ఉండడంతో తదుపరి సైరాకి ఇది కలిసొచ్చే అంశం. అలానే అల్లు అరవింద్ రామాయణం ప్రకటించడంతో పోటీ పెరిగింది. రాజమౌళి నెక్ట్స్ చేయబోయేది మహాభారతం అయితేనే ఛాలెంజింగ్ గా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి 300కోట్లు పెడుతున్నారు కాబట్టి.. దీనికి నాలుగు రెట్లు అదనపు బడ్జెట్ తో మహాభారతం సిరీస్ ని నిర్మించి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసే వీలుంటుంది. ఈ ప్రయత్నం స్వాగతించదగినదే.