కరోనా తో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జనజీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ‘నెవర్ బిఫోర్’ బడ్జెట్‌ను ప్రకటించనున్నట్లు నిర్మల ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. కరోనాతో కుదేలైన వ్యవస్థలన్నీ 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాయి.
ఈ బడ్జెట్ కి మరికాసేపట్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బడ్జెట్ ప్రతులతో కలిసి క్యాబినెట్ సమావేశానికి బయలుదేరారు. మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న క్యాబినెట్ ఈ బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది. ఆపై ఉదయం 11 గంటల సమయంలో పార్లమెంట్ ముందుకు రానుంది.
కాగా, గత సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే, వాస్తవ కేటాయింపులు సమూలంగా మారిపోయాయన్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ కారణంగా, బడ్జెట్ కేటాయింపులు ఎన్నో రంగాలకు జరగలేదు. లాక్ డౌన్ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయి. నిధులను దారి మళ్లిస్తూ, ఎప్పటికప్పుడు మార్చాల్సి వచ్చింది. ఈ సంవత్సరం వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందన్న ఆర్థిక సర్వే అంచనాల నేపథ్యంలో నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది.
మంత్రులు నిర్మాలా సీతారామన్, అనురాగ్ ఠాగూర్ సోమవారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి రాష్ట్రపతి కార్యాలయంలో ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. అనంతరం పార్లమెంట్‌కు బయలుదేరి వెళ్లారు. కేబినెట్ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం అనంతరం లోక్‌సభలో ప్రవేశపెడతారు.