అదో రకం ఆట.. అసలేం జరుగుతోంది?
తాగి డ్రైవ్ చేయడం నేరం. పైగా యాక్సిడెంట్ చేస్తే ఇంకేమైనా ఉందా? అది ఇంకా పెద్ద నేరం. ఈ రెండు నేరాలతో యంగ్ హీరో రాజ్ తరుణ్ అడ్డంగా బుక్కయిపోయాడు. తాగి కార్ ని డ్రైవ్ చేస్తూ రోడ్ లో యాక్సిడెంట్ చేయడమే గాక.. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయేందుకు ప్రయత్నిస్తూ సీసీ కెమెరాల్లో దొరికేయడం.. అటుపైనా ఓ మొబైల్ వీడియోలో ప్రూఫ్ తో దొరికిపోవడం ఇదంతా పెద్ద రచ్చకు కారణమైంది. అసలే మీడియా టీఆర్పీ గేమ్ ఆడేందుకు నిరంతరం చకోర పక్షిలా ఎదురు చూస్తోంది. ఇలాంటి టైమ్ లో ఎవరైనా సెలబ్రిటీ దొరికితే ఎలా ఉంటుంది? అనవసరం గా ఆహారం అయిపోవడమే. ఇకపోతే సదరు హీరోగారిని బుక్ చేయడానికి ఈ వ్యవహారంలో ఓ సెక్షన్ మీడియా చాలానే ఉబలాట పడిందన్న గుసగుసలు తాజాగా వినిపిస్తున్నాయి.
చేసిన తప్పును దాచేందుకు ప్రయత్నించి సదరు యంగ్ హీరో తప్పు చేశాడు నిజమే. అటుపైనా వ్యక్తిగత వ్యవహారాలు చూసే మేనేజర్ రాజా రవీంద్ర పరిస్థితిని చక్కదిద్దడంలో దారుణంగా విఫలమయ్యాడు. ఉన్నదానిని పదింతలు చేసి మీడియాకి తెలిసిపోయేంతగా దొరికిపోవడంతో ఈ వ్యవహారం కాస్తా మరింత రచ్చయ్యింది. పైగా మొబైల్ ఫోన్ లో వీడియో తీసిన ఆ యువకుడు పూస గుచ్చినట్టు ఈ వ్యవహారం అంతా చెప్పడం.. తనని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పడంతో సదరు యంగ్ హీరోతో పాటుగా.. మేనేజర్ కూడా బుక్కయిపోయాడు. బెదిరింపులు అన్న నెపంతో రాజా రవీంద్రకు ఇప్పుడు పోలీస్ నుంచి ఇబ్బందులు తప్పవు. ఇన్సిడెంట్ జరిగాక దానిని సరి చేసుకోవడంలో వైఫల్యం ఆ ఇద్దరికీ ఇప్పుడు శాపంగా మారిందట. మరోవైపు ఓ సెక్షన్ మీడియా కావాలనే ఈ వార్తను హైలైట్ చేస్తూ టీఆర్పీ గేమ్ ఆడడంపైనా చర్చ సాగుతోంది. ఎదగాల్సిన హీరోని ఎదగకుండా ఏదైనా కుట్ర జరిగిందా? అంటూ కొందరు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం దిల్ రాజు ఆస్థానంలో ఈ యంగ్ హీరో ఓ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ లో ఆయుష్మాన్ నటిస్తున్న `డ్రీమ్ గాళ్` రీమేక్ లో రాజ్ తరుణ్ నటించాల్సి ఉందన్న వార్తలు వచ్చాయి. అసలే కెరీర్ స్ట్రగుల్స్ లో ఉండగా కెరీర్ ని చక్కదిద్దుకోవాల్సిన టైమ్ లో ఇలా యువహీరో అని కూడా చూడకుండా మీడియా షంటేస్తుంటే అతడికి ఏం చేయాలో పాలుపోవడం లేదట.