కార్యేషు దాసీ , కరణేషు మంత్రి, భోజ్యేషు మాత , శయనేషు రంభ అన్నారు ఆర్యులు. స్త్రీలో ముఖ్యంగా అర్ధాగిలో ఇన్ని గుణాలను అందరూ చూడలేరు . భార్యను రంభగా భావించేవారు , పడకటింటికి మాత్రమే పరిమితం అనుకునేవారు ఎందరో. అయితే పైన పేర్కొన్న లక్షణాలు భార్యలో చూసిన వారు చాలా తక్కువ మంది . అలాంటివారిలో సినిమారంగంలో నిస్సందేహంగా అక్కినేని నాగేశ్వర్ రావు ను పేర్కొనాలి . ఈరోజు అక్కినేని 95వ జయంతి . ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వర రావు శ్రీమతి అన్నపూర్ణ దాపత్య జీవిత విశేషాలు తెలుసుకుందాం .
అక్కినేని నాగేశ్వర రావు సినిమా నటుడు . ఆయన సినిమా విడుదలైతే జనం విరగబడి చూసేవారు . అలాంటిది అక్కినేనికి పెళ్లి ఓ పెద్ద సమస్య అయ్యింది . వారి అన్నయ్య అక్కినేని రామ బ్రహ్మం , శ్రేయోభిలాషి దుక్కిపాటి మధుసూదన రావు నాగేశ్వర రావు కు వివాహం చెయ్యడానికి విశ్వ ప్రయత్నం చేశారు . సినిమా హీరోను అభిమానిస్తారు కానీ పెళ్లి అనగానే ఎవరు ముందుకు రావడం లేదు . ఇది 1949 నాటి సంఘటన. అప్పటికే సీతారాం జననం, ముగ్గురు మరాఠీలు , మాయలోకం, పల్నాటి యుద్ధం , రత్నమాల, బాలరాజు , కీలుగురం సినిమాలతో అక్కినేని నాగేశ్వర్ రాప్ పేరు ఆంధ్ర ప్రదేశ్లో మారుమ్రోగి పోతుంది . కానీ నాగేశ్వర రావు కు పెళ్లి పెద్ద సమస్య అయిపొయింది . ఇలాంటి పరిస్థితుల్లో ఏలూరుకు చెందిన కొడాలి వెంకటనారాయణ కుమార్తె అన్నపూర్ణ , నాగేశ్వర రావును వివాహం చూసుకోడానికి ముందుకు వచ్చింది . వారిది చాలా కలిగిన కుటుంబం . ఆమెకు అప్పుడు 16 ఏళ్ళే . పైగా మేనరికం వుంది. అయినా నాగేశ్వర రావును చేసుకుంటానని పట్టుపట్టింది . అప్పటికి నాగేశ్వర రావు నటించిన సినిమాలు పెద్దగా చూడలేదు . వారి కుటుంబానికి సన్నిహితుడు పోలవరపు సూర్య ప్రకాష్ రావు ఈ సంబంధాన్ని తీసుక వచ్చాడు . ఏలూరుకు అక్కినేని వచ్చి అన్నపూర్ణను చూశాడు . వెంకటనారాయణ ఏ సంగతి చెప్పలేదు . కానీ అన్నపూర్ణ మాత్రం అక్కినేని నాగేశ్వర రావుని చేసుకుంటానని మొండి పట్టు పట్టింది . కూతురు మాటను గౌరవించిన వెంకటనారాయణ సరే అన్నాడు .అక్కినేని తో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది .
వివాహం అయిన తరువాత మద్రాసులో కాపురం పెట్టారు . అక్కినేని అంటే ఈర్ష్య పడేవారు అన్నపూర్ణకు ఉన్నవి లేనివి కల్పించి చెప్పేవారు . అక్కినేనితో హీరోయిన్లకు సంబంధాలు ఉన్నాయని ప్రచార చేసేవారు అయినా ఏనాడు అన్నపూర్ణ భర్తను అనుమానించలేదు , అడగను లేదు .
అక్కినేనికి తల్లి పున్నమ్మ అంటే విపరీతమైన అభిమానం, ప్రేమ , షూటింగ్ నుంచి ఎంత రాత్రి అయినా ఇంటికి రాగానే తల్లి గదికి వెళ్లి చూసేవాడు . ఆమె నిద్రపోతు ఉంటుందని తెలుసు . అయినా అదో తృప్తి , అలవాటు . తల్లి చనిపోయిన తరువాత భార్యలో తల్లిని చూసుకున్నాడు . అంటే కాదు తనకి సంబందించిన ప్రతి విషయం కూడా చెప్పేవాడు కాదు . ఆమె సలహాలు తీసుకునేవాడు . భార్యకు అబద్దం చెప్పేవాడు కాదు . ఎప్పుడైనా మందు విషయంలో చిన్న అబద్దం ఆడినా అన్నపూర్ణ యిట్టె పట్టేసేది .
తనకి ఎవరూ పిల్లని ఇవ్వని రోజుల్లో శ్రీమంతుల బిడ్డ అయిన అన్నపూర్ణ తనని చేసుకుందనే కృతజ్ఞతా భావం అక్కినేనిలో ఉండేది . అందుకే అక్కినేని స్టూడియో కు ఆమె పేరు పెట్టాడు, ప్రొడక్షన్ హౌస్ కు, పంపిణి సంస్థకు, ఫామ్ హౌస్ కు… ఇలా అన్నింటికీ ఆమె పేరు పెట్టి సంతృప్తి పడ్డాడు . ఆమె చివరి రోజుల్లో మంచానికే పరిమితమైతే బయటకు వెళ్లడం మానేసి సపర్యలు చేసేవాడు . . అక్కినేని నాగేశ్వర్ రావు లాంటి భర్త లభించినందుకు ఆమె తన పూర్వ జన్మ అదృష్టం అని చెప్పేది . తాను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని , తన జీవితం సార్ధకం అయ్యిందని అన్నపూర్ణ చాలా సంతృప్తిగా చెప్పేది . రిపూర్ణమైన జీవితం గడిపిన అన్నపూర్ణమ్మ 28 డిసెంబర్ 2011న ఇహలోక యాత్ర ముగించారు .