లాక్ డౌన్ తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. గడప దాటడానికి వీలు లేదు. ఎక్కడి వారు అక్కడే గప్ చుప్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీనిలో భాగంగా లాక్ డౌన్ ఇబ్బందులను గుర్తించిన పలువురు సెలబ్రిటీలు కష్టాల్లో ఉన్నవారికి వీలున్నంత వరకూ చేయూతనందించారు. వైరస్ ను ఎదుర్కోవడంపై అవేర్ నేస్ వీడియోలు చేసారు. అయితే తమిళ నటి వరలక్ష్మి మాత్రం వాళ్లందరికంటే భిన్నంగా ఓ కొత్త సమస్యను తెరపైకి తీసుకొచ్చి శహభాష్ అనిపించింది. ఇలాంటి సమయంలో మహిళలపై లైంగిక వేధింపులు సహా ఇంకేమైనా జరగొచ్చు! అంటూ తమిళ నటి వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది.
మహిళలపై దాడులు చేయడానికి ఇదే చక్కని సమయం. నాలుగు గోడల మధ్యే ఉన్నారు. ఏం చేసినా ఎవరితోనూ చెప్పుకోలేరు. లైంగిక దాడి..గృహ హింస…ఇంకా చాలానే జరగొచ్చు. ఎలాంటి సమయంలోనైనా వాళ్లను రక్షించాల్సిన బాధ్యత ఉంది. మహిళల కు సాయం చేయండి అంటూ అమ్మడు హెల్ప్ లైన్ నంబర్లు ట్విటర్లో షేర్ చేసింది. మన చుట్టు ఉన్న మహిళలకు సాయం చేద్దాం. ప్రమాదాల నుంచి కాపాడుదాం! అంటూ 1800, 102, 7282 నంబర్లను షేర్ చేసింది. వేధించడానికి వయసు, ఆస్తి, స్థాయితో సంబంధం లేదు. ఎక్కడైనా ఇది జరగొచ్చు అని తెలిపింది.మహిళల నుంచి ఇలాంటి సమస్యను గుర్తించినందకు తోటి సెలబ్రిటీలు అమ్మడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వరలక్ష్మి తెలుగు లో నేరుగా తెనాలి రామకృష్ణ సినిమాలో నటించింది. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తోన్న క్రాక్ లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే పలు తమిళ అనువాద సినిమాలతోనూ తెలుగులో మంచి నటిగా గుర్తింపు దక్కించుకుంది. తమిళ చిత్రాల్లో లేడీ విలన్ గా నటించి అనువాదాలతో అమ్మడు ఇక్కడా బాగా పాపులర్ అయింది.