ధనత్రయోదశి పండుగ సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యానికి కారణమయ్యే శుభ సమయం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈసారి ధన త్రయోదశి అక్టోబర్ 18న జరగనుంది. త్రయోదశి తిథి మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5:48 నుంచి రాత్రి 8:20 వరకు ప్రదోష కాలం ఉండగా, ధంతేరస్ పూజా ముహూర్తం సాయంత్రం 7:29 నుంచి 8:20 వరకు శుభ సమయంగా నిర్ణయించబడింది. ఈ కాలం లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం ధంతేరస్ లేదా ధనత్రయోదశి రోజు త్రిపుష్కర యోగం, హంస మహాపురుష రాజయోగం, ఇంద్రనియోగం అనే మూడు ముఖ్యమైన శుభ యోగాలు కలవడం ప్రత్యేకత. ఈ శుభసమయం ధనం, ఆర్థికాభివృద్ధి, వ్యాపారవృద్ధికి అదనపు శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం అత్యంత అనుకూలమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యాపార ప్రణాళికలు మొదలుపెట్టడం, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో శుభఫలితాలు ఇస్తాయని విశ్వాసం.
ధంతేరస్ రోజున ఇంటిని శుభ్రపరచి, అవసరం లేని పాత వస్తువులు, విరిగిపోయిన సామాన్లు తొలగించాలి. బంగారం, వెండి వస్తువులను శుభ్రం చేసి ప్రత్యేకంగా ఉంచాలి. పూజ సమయానికి దీపాలు వెలిగించి, శంఖధ్వనులతో పవిత్ర వాతావరణం సృష్టించడం శ్రేయస్కరం. దక్షిణం వైపు ఉన్న శంఖంలో నీరు నింపి ఇంటి చుట్టూ చల్లడం లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే ప్రత్యేక శుభచర్యగా పరిగణిస్తారు.
ఆర్థిక సంక్షోభంతో బాధపడేవారికి ఈ సమయం ఒక బంగారు అవకాశంగా పండితులు సూచిస్తున్నారు. ధంతేరస్ నుంచి దీపావళి వరకు ప్రతిరోజూ లక్ష్మీదేవికి ఒక జత లవంగాలు సమర్పించి ప్రార్థించడం ఆర్థిక సమస్యలను తగ్గించి, సంపదను ఆకర్షిస్తుందని నమ్మకం. ఈ రోజున Dhanvantari, Lakshmi, Ganeshaతో పాటు Kuberaను పూజించడం సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగడానికి సూచించబడింది.
ధంతేరస్ తర్వాత దీపావళి ఉత్సవాల శోభ మొదలవుతుంది. అక్టోబర్ 18 నుంచి 23 వరకు పండుగ వాతావరణం కొనసాగుతుంది. ప్రధాన దీపావళి అక్టోబర్ 20న జరగనుంది. ఉత్తర భారతదేశంలో మాత్రం అక్టోబర్ 21న దీపావళి వేడుకలు జరుగుతాయి. ఈ పండుగ కాలంలో చిన్న దీపావళి, గోవర్ధన పూజ, యమద్వితీయ వంటి ఆచారాలు జరుపుకుంటారు.
పండితుల సూచన ప్రకారం, పూజ సమయంలో కుటుంబ సభ్యులంతా ఒకేసారి పాల్గొనడం అత్యంత శుభప్రదం. మధ్యలో ఎవరైనా ఆలస్యంగా రావడం లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించడం లక్ష్మీదేవిని అసంతృప్తిపరచవచ్చని హెచ్చరిస్తున్నారు. అమ్మవారి కటాక్షం నిలకడగా ఉండాలంటే పూజను సమష్టిగా, ఆనందంగా నిర్వహించడం ముఖ్యం.
దీపావళి సమయంలో ఇంట్లో టపాసులు కాల్చకుండా బయట ప్రాంగణంలోనే కాల్చాలని పండితులు సూచిస్తున్నారు. పూజ సమయంలో మృదువైన హైందవ సంగీతం, లక్ష్మీ పాటలు వినిపిస్తే కుటుంబంలో సానుకూల శక్తి పెరిగి సంతోష వాతావరణం నెలకొంటుందని విశ్వాసం. దీపాల కాంతి, శంఖధ్వనులు, భక్తి గీతాలు లక్ష్మీదేవిని ఇంట్లో నిలిపే దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ధంతేరస్ నుంచి దీపావళి వరకు ఉండే ఈ ఆధ్యాత్మిక సమయం, ధనం, ఐశ్వర్యం, శ్రేయస్సును ఆకర్షించేందుకు అత్యంత శక్తివంతమైన కాలంగా పరిగణించబడుతుంది. పవిత్రమైన మనస్సుతో అమ్మవారిని ఆహ్వానిస్తే… అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి.
