సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించింది రవితేజ నటించిన క్రాక్. రవితేజకు దాదాపు నాలుగేళ్ళ తర్వాత సిసలైన విజయం తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక రవితేజ సైడ్ కారెక్టర్స్ వేసుకోవాల్సిందే అంటూ సెటైర్లు పేలుతున్న సమయంలో తానింకా అయిపోలేదని.. ఇప్పుడే మొదలుపెట్టానంటూ క్రాక్‌తో కిరాక్ పుట్టించాడు మాస్ రాజా. ఈయన దెబ్బకు ఏకంగా సంక్రాంతికి థియేటర్‌లు మోతెక్కిపోయాయి.
అంత అద్భుతంగా వసూళ్లు సాదిస్తున్న సినిమాను మూడు వారాలకే ఆహాలో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దాంతో థియేటర్స్‌లో ఎక్కడ ఆపాడో.. అక్కడ్నుంచే ఆహాలో మొదలుపెట్టాడు పోతరాజు వీరశంకర్. ఈయన దూకుడుకు ఏడాది వయసున్న ఆహా రికార్డులన్నీ తునాతునకలు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆహా ప్లాట్ ఫామ్‌లో కలర్ ఫోటో సినిమాకు హైయ్యస్ట్ వ్యూస్ వచ్చాయి. దాన్ని చాలా తక్కువ సమయంలోనే క్రాస్ చేసింది క్రాక్.
తన పేరు మీదే ఇప్పుడు కొత్త రికార్డులను సెట్ చేసుకున్నాడు రవితేజ. ఫిబ్రవరి 5న క్రాక్ ఆహాలో విడుదలైంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు రచ్చ చేస్తూనే ఉంది. కేవలం నాలుగు రోజుల్లో 5 మిలియన్ మినిట్స్ వ్యూస్ అందుకున్న క్రాక్.. ఇప్పుడు అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 250 మిలియన్స్ అంటే 25 కోట్ల నిమిషాల స్ట్రీమ్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు ఆహా టీం. ఈ సినిమాను 8.4 కోట్లకు కొనేసింది ఆహా. నిజానికి జనవరి 29నే సినిమాను స్ట్రీమ్ చేయాలని నిర్ణయించినా బయ్యర్లు గోల పెట్టడంతో మరో వారం పొడిగించారు. ఫిబ్రవరి 5న వచ్చిన ఈ సినిమాకు అప్పటి నుంచి కూడా వ్యూస్ వస్తూనే ఉన్నాయి