కేజీఎఫ్ 2 సంక్రాంతి రిలీజ్ డౌట్
`కేజీఎఫ్ 2` లో బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ నటించేందుకు అంగీకరించడం అన్నదే బిగ్ గేమ్ ఛేంజర్. అంత పెద్ద స్టార్ ఈ ప్రాజెక్టులో రంగ ప్రవేశం చేయడంతో అమాంతం కేజీఎఫ్ ఫ్రాంఛైజీకి పదింతలు క్రేజు పెరిగిందనే చెప్పాలి. ఒక సౌత్ సినిమాకి మున్నాభాయ్ లాంటి క్రేజీ స్టార్ ఓకే చెప్పడంతోనే అటు హిందీ మార్కెట్లోనూ దీనిపైన ఆసక్తికర చర్చ సాగింది. అందుకు తగ్గట్టే ప్రశాంత్ నీల్ అధీరా పాత్రను అంతే ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దారు. మొన్న రిలీజైన సంజయ్ దత్ అధీరా లుక్ చూశాక.. ఆ పాత్ర అభిమానుల్ని ఎంతగానో మెస్మరైజ్ చేస్తుందని భావించారు.
కానీ ఇంతలోనే ఊహించని పిడుగులాంటి వార్త కేజీఎఫ్ టీమ్ ని బెంబేలెత్తించింది. సంజయ్ దత్ కి నాలుగో దశ క్యాన్సర్ అన్న వార్తతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే హీరో యష్ .. అధీరా పాత్రకు సంబంధించిన రెండు భారీ ఫైట్స్ ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్టోబర్ నుంచి సంజయ్ దత్ ని సెట్స్ కి రావాల్సిందిగా పిలిచారు. అందుకు ఆయన నుంచి పాజిటివ్ సంకేతాలు అందుతాయని భావిస్తుండగా ఉన్నట్టుండి తనకు క్యాన్సర్ ఉందని ప్రకటించి బిగ్ షాక్ ఇచ్చారు సంజయ్ దత్.
ఇది పిడుగు పాటు లాంటిదే. అసలే కోవిడ్ 19 విలయం వల్ల ఇప్పటికే ఈ భారీ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైంది. ఈపాటికే రిలీజ్ కావాల్సిన సినిమా కాస్తా వాయిదా పడింది. సంక్రాంతికి అయినా వస్తుంది అనుకుంటే ఈలోగానే ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. కోట్లాది రూపాయల పెట్టుబడులు వెదజల్లేందుకు తెచ్చిన అప్పులతో వెతలు ఎన్నో దీని వెనక ఉన్నాయి. ఇప్పుడు అనూహ్యంగా భాయ్ లేకపోతే ఎలా? తన పార్ట్ షూటింగ్ ఇంకా పెండింగులో పడిపోవడంతో ఇప్పుడు షాక్ తినాల్సిన పరిస్థితి తలెత్తింది. సంజయ్ దత్ కి క్యాన్సర్ అని తెలియగానే ప్రశాంత్ నీల్ – హోంబలే బృందాలు షాక్ తిన్నామని ప్రకటించాయి. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థించారు.
ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ ప్రాజెక్టు వాయిదా పడడంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక డీవీవీ దానయ్య లాంటి స్టార్ ప్రొడ్యూసర్ కి గుండె నొప్పి రావడం తెలిసిందే. ఇక నాలుగు నెలలుగా కోవిడ్ విలయం వల్ల మల్టీప్లెక్సులు తెరుచుకోకపోవడంతో ఏషియన్ సునీల్ నారంగ్ వంటి పెద్దలకు గుండె నొప్పి వచ్చింది. ఇప్పుడు నాలుగు నెలల షూటింగ్ వాయిదా.. దాంతో పాటే అన్ని పనులు వాయిదా పడడంతో కేజీఎఫ్ 2 బృందానికి తీవ్రమైన కలత తప్పడం లేదు. పైగా సంజయ్ దత్ పాత్రతో ఎంతో ముడిపడి ఉంది. ఇలాంటప్పుడు ఆయనకు క్యాన్సర్ లాంటి ప్రమాదకర పరిణామం ఊపిరి సలపనివ్వడం లేదనే భావించవచ్చు. అయితే మున్నాభాయ్ అమెరికాలో వైద్యం చేయించుకునేందుకు వెళ్లారు. త్వరగా కోలుకుని చిత్రబృందానికి సహకరిస్తారనే భావిద్దాం. అన్ని పరిణామాల నుంచి సినీపరిశ్రమలు కోలుకోవాలని ఆకాంక్షిద్దాం. కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండడంతో కొంతవరకూ ఊరట లభిస్తోంది.