భయపెట్టడం కాదు.. మభ్య పెట్టడం అసలే కాదు.. కళ్ల ముందరి భీతిగొలిపే వాస్తవమిది.. నమ్మితే నమ్మండి.. మీడియాకి అందిన సమాచారమిది. కరోనా అల్లకల్లోలం దేశంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల అన్ని నగరాల్లో అసాధారణంగా ఉందిప్పుడు. మొన్నటివరకూ పదుల సంఖ్యలో.. ఇప్పుడు వందల సంఖ్యలో.. మునుముందు వేలు.. లక్షలు ప్రతి నగరంలో కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రుల్లో కనిపించే పరిస్థితి.
వలసకూలీల రాకతో ఇక పల్లెటూర్లకు ఇది వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోని పరిస్థితి.. ఆస్పత్రి లో ఓవైపు శవాలు.. ఇంకోవైపు పేషెంట్లు.. ధైన్య స్థితి.. ముంబై .. దిల్లీలోనే అదుపు చేయలేకపోయారు.. హైదరాబాద్ – గాంధీ ఆస్పత్రిలో ఇదే స్థితి.. అన్ని కొవిడ్ ఆస్పత్రుల్లో ఇక చేర్చుకునే వెసులుబాటు లేనేలేదు. నెల క్రితం అస్సలు ఒక్క కేసు కూడా రాలేదు అని చెప్పిన శ్రీకాకుళంలో 220 మంది కొవిడ్ 19 రోగులు ఆస్పత్రిలో చేరారు.. విజయనగరం అందుకు మినహాయింపేమీ కాదు. ప్రతి జిల్లా పల్లెపల్లెనా ఇకపై కొవిడ్ 19 మహమ్మారీ విస్తరించే పరిస్థితి ఇంకెంతో దూరంలో లేదు.
ప్రభుత్వాలు చేతులెత్తేసి ప్రయివేటు ఆస్పత్రుల చికిత్సకు బార్లా తెరిచింది ఇందుకే.. అయితే ప్రయివేటుకు వెళ్లి చికిత్స చేయించుకునేది ఎందరు? తెలుగు రాష్ట్రాల్లో పేద మధ్య తరగతి పరిస్థితి ఏమిటి? అన్నది ఆ పైవాడికే తెలియాలి. ఒకటీ అరా కేసులు వచ్చినప్పుడు లాక్ డౌన్ పాటించాం. వందలు వేల కేసులు నమోదవుతున్న ఈ తరుణంలో లాక్ డౌన్ ఎత్తేశాయి ప్రభుత్వాలు. అంటే దీనర్థం ఎవరి చావు వాళ్లు చావండి అనే! కరోనాని కూడా ఒక సాధారణ ఫ్లూగానే భావించి సహజీవనం చేయాలనేది ప్రభుత్వాధీశులు చెబుతున్న మాట. వచ్చాక తిరిగి తగ్గించుకోగలిగేవాడే దేవుడు. చేతకాని వాడు కైలాసానికే అన్న తీరుగా ఉంది.. ఇది ఎవరో చెబుతున్నది కాదు. అన్నిచోట్లా ప్రజల్లో సాగుతున్న చర్చ.
మరోసారి ప్రభుత్వాలు లాక్ డౌన్ వేస్తాయనుకోవడం అపోహ. ప్రస్తుతం వ్యవస్థను నిలబెట్టడం కష్టసాధ్యమైనది. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు అస్థవ్యస్థంగా ఉన్నాయి. పాతికేళ్ల వెనక్కి వెళ్లింది మన దేశం. ఇప్పుడు తిరిగి గాడిన పెట్టకపోతే దాని పర్యవసానం అంతే దారుణంగా ఉంటుంది. అందువల్ల పేదలు.. మధ్య తరగతి ప్రజలు హైఅలెర్ట్ గా ఉండడం అత్యవసరంగా మారింది. కేర్ లెస్ గా ఉంటే అది ఊహించని పరిణామాలకు దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలు చుట్టబెట్టేసే ప్రమాదం మునుముందు పొంచి ఉందన్న రిపోర్ట్ అందింది.
కరోనా విలయాన్ని ఆపే మందు ఇప్పట్లో లేదు. కొన్ని మందుల కంపెనీలు వారి వ్యాక్సిన్లు.. ట్యాబ్లెట్లు అమ్ముకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. రోగం పేరుతో దోపిడీకి పాల్పడబోతున్నాయి. పూర్తిగా నయం చేస్తాయి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అది అపోహ మాత్రమే. దీనికి పరిష్కారం ఇప్పట్లో లేదు. ఈ విలయానికి అంతం ఎప్పుడు? అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. సిసలైన వ్యాక్సిన్ తయారవ్వలేదింకా. అందుకు సంవత్సరం పట్టొచ్చు.. రెండేళ్లు పట్టొచ్చు. లేదా కనిపెట్టకపోవడం అసాధ్యం కావొచ్చు కూడా. ఒక్క భారతదేశంలోనే కోటి లేదా 2-3 కోట్ల కేసులు నమోదయ్యేందుకు ఆస్కారం ఉందని ప్రముఖులు విశ్లేషిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలి. కరోనాకు మాన్యులు సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడానే లేదు. దానికి ఎవరైనా ఒకటే. అందుకే తస్మాత్ జాగ్రత్త!!! మీ చుట్టూనే కరోనా..!!
-శివాజీ.కె