కె. విశ్వనాథ్‌ బయోపిక్‌.. ‘విశ్వదర్శనం’ టీజర్‌

కళాతపస్వి కె విశ్వనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వదర్శనం’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల. రచయిత జనార్ధనమహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 19న విశ్వనాథ్ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘విశ్వదర్శనం’ టీజర్‌ను విడుదల చేశారు.

‘వందేళ్ల వెండితెర చెబుతున్న తొంభై ఏళ్ల బంగారు దర్శకుడి కథ’ అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. రాధికా శరత్‌కుమార్‌, సుశీల, భానుప్రియ, ఆమని, శైలజ, విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు విశ్వనాథ్‌ గొప్పతనం గురించి టీజర్‌లో వివరించారు.

Viswadarshanam Movie Teaser | Journey of K Viswanath Garu | Tanikella Bharani | JanardhanaMaharshi

విశ్వనాథ్‌కు సంబంధించిన అలనాటి ఫొటోలను టీజర్‌లో చక్కగా చూపించారు. ‘సినిమా అనే ఓ బస్సును పట్టుకుని, సినిమా చూసేవారు ప్రేక్షకులు భక్తులు అనుకుని నేను బస్సు నడిపే డ్రైవర్‌ను. ఏం చేయాలి నేను?’ అంటూ చివర్లో విశ్వనాథ్‌ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్‌ ప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కె. విశ్వనాథ్ మాట్లాడుతూ… నా గురించి అందరికీ తెలియాలని కోరుకోను. కానీ కొన్నిసార్లు మనవారికోసం కొన్ని ఖచ్చితంగా చేయాలి. అటువంటి ప్రయత్నమే ‘విశ్వదర్శనం’. ఈ ఆలోచనలకు నీరుపెట్టింది, నారుపోసింది అంతా జనార్ధన మహర్షి. నా పుట్టినరోజు సందర్భంగా వాళ్లుచేస్తున్న టీజర్ రిలీజ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అన్నారు.

తనికెళ్ల భరణి మాట్లాడుతూ… దర్శకులకు అభిమానులుంటారని, కాని విశ్వనాథ్‌కు భక్తులుంటారన్నారు. ఈ సినిమాకు డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేం కానీ కీర్తి మాత్రం పుష్కలం. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు.

దర్శకుడు జనార్ధన మహర్షి మాట్లాడుతూ …‘చిన్నప్పటినుండి ఆయన తీసిన సినిమాల్లోని కథలను అమ్మ చెప్తుంటే వింటూ పెరిగా. నాకు గురువు, దైవమైన తనికెళ్ల భరణి దగ్గర మూడేళ్లు అసిస్టెంట్‌గా పనిచేసి తర్వాత 100 సినిమాలకు మాటల రచయితగా పనిచేశా. 2011లో నా సొంత బ్యానర్‌పై ‘దేవస్థానం’తో ఆయన్ని దర్శకత్వం చేసే భాగ్యం దక్కింది.

మళ్లీ 2019లో ఆయనతో పనిచేసే అవకాశం ‘విశ్వదర్శనం’ ద్వారా వచ్చింది. చిత్రంలో ఆయన బయోగ్రఫీ చూపించటం లేదు. ఓ మహాదర్శకుని సినిమాలు సొసైటీపై ఎలాంటి ప్రభావం చూపించాయనేది చూపించబోతున్నాం’ అన్నారు.

వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ ‘విశ్వదర్శనం’ మంచి ప్రయత్నం. ఇందులో మా నిర్మాత విశ్వప్రసాద్‌తో భాగమైనందుకు గర్వంగా ఉంది’ అన్నారు. సింగర్ మాళవిక మాట్లాడుతూ విశ్వనాథ్ జీవిత కథను నా గొంతుతో డబ్బింగ్ చెప్పటం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు.