38 ఏళ్ల ‘స్వాతిముత్యం’

కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లి అయిన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో… వాళ్ళిద్దరికీ ముడిపడితే? ఇలాంటి పాత్రలతో, ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ, ఆ ప్రయోగాన్ని క్లాస్‌తో పాటు మాస్‌ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు, బాక్సాఫీస్‌ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిపారు. అది ఓ క్రియేటివ్‌ జీనియస్‌ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం! అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట – కె. విశ్వనాథ్‌. కమలహాసన్‌ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్‌బస్టర్‌ అద్భుతం – ‘స్వాతిముత్యం’కి ఈ మార్చి 13తో 38 వసంతాలు.

మాస్‌ కథాంశాలైతేనే జనం చూస్తారు. క్లాస్‌ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు! నిజానికి, అది ఓ తప్పుడు కమర్షియల్‌ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్‌ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు. బాక్సాఫీస్‌ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం – కమలహాసన్, రాధిక జంటగా, దర్శకుడు కె. విశ్వనాథ్‌ రూపొందించగా , ఏడిద నాగేశ్వరరావు పూర్నోదయా పతాకంపై నిర్మించిన ద్రుశ్య కావ్యం ‘స్వాతిముత్యం’.

కల్మషం లేని కథ… కల్లాకపటం తెలీని హీరో…కల్లాకపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా, మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య (కమలహాసన్‌). ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడిన లలిత (రాధిక), ఓ పిల్లాడికి (మాస్టర్‌ కార్తీక్‌) తల్లి అయ్యాక, భర్త పోవడంతో తల చెడ్డ ఇల్లాలిగా అన్నావదినల పంచన బతుకీడుస్తుంటుంది. విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కల్యాణ వేళ అమాయకంగా తాళికట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా ‘స్వాతిముత్యం’ కథ. భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో, భర్త పోయి, ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన ‘శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్‌ అన్నారు. కానీ, చివరకు అందరూ ‘స్వాతిముత్యం’ టైటిల్‌ కే మొగ్గారు.

మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తంటికొండ , పట్టిసీమ ప్రాంతాల్లో షూట్‌ చేసిన ఈ సినిమాకు కమలహాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్‌ ప్రాణంపోశాయి. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ (ఆత్రేయ), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘ధర్మం శరణం గచ్ఛామి’, ‘మనసు పలికే మౌన గీతం’ (సినారె) పాటలు ఆల్‌టైమ్‌ హిట్స్‌. ముఖ్యంగా, మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్‌ పరిచయం చేసి, కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్నీ, ఆ ప్రణయ గీతాన్నీ విశ్వనాథ్‌ సున్నితమైన శైలిలో, అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం. ఆ పాటతో పాటు, సినిమాలోని చాకలి సుబ్బులు – వెంకటసామి పాత్రల్లో దీప, ఏడిద శ్రీరామ్‌ కూడా గుర్తుండిపోతారు.

ప్రతి సినిమాలోలాగానే ‘స్వాతిముత్యం’ పాటల రచనలోనూ విశ్వనాథ్‌ హస్తం ఉంది. ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్‌ చేయడానికి విశ్వనాథ్‌ అప్పటికప్పుడు అనుకొని, జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని…’ పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్‌ కోసం మార్గమధ్యంలో ఏదిద , కమలహాసన్ లు ఆ పాటకు ట్యూన్‌ కట్టగా , కమలహాసన్ , పాడారు. ఆ వెర్షన్‌తోనే షూటింగ్‌ చేశారు.తర్వాత బాలు, శైలజలతో పాడించారు.

ఇక, ‘వటపత్రసాయికి…’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్‌ సమకూర్చినవే. అదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్‌ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ చిత్రం కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది. ఎం.వి. రఘు ఛాయాగ్రహణం అందించారు.

వందరోజుల వేళ…స్వాతిముత్యం’ ఆ రోజుల్లో 35 థియేటర్లలో, మధ్యలో గ్యాప్‌ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే! ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్‌గా ‘స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది. పలుచోట్ల 25 వారాలు (రజతోత్సవం) దాటి ప్రదర్శితమైంది. బెంగుళూరు, మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్‌ ఇదే! దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్‌ షేర్‌ వసూలు చేసిన బ్లాక్‌ బస్టర్‌ కూడా ఇదే! 1986 జూన్‌ 20న హైదరాబాద్‌ దేవి థియేటర్‌లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆరే (అప్పటి సి.ఎం) స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శక, నిర్మాత రాజ్‌కపూర్‌ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి మరో ముఖ్య అతిదిగా పాల్గున్నారు .విశ్వనాథ్‌ – ఏడిద జంట నుంచి దేశం గర్వించే మరిన్ని చిత్రాలు రావాలని కళాపిపాసి అయిన ఎన్టీఆర్‌ ఆకాంక్షించారు.

ఆస్కార్‌కు ఎంట్రీ! హాలీవుడ్‌ ఫిల్మ్‌తో పోలిక!!ఆస్కార్స్‌కు ఇండియన్‌ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా ‘స్వాతిముత్య’మే! తుది జాబితాకు నామినేట్‌ కాకపోయినా, మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్‌ ‘ఫారెస్ట్‌గంప్‌’(1994)కూ, మన ‘స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి. టామ్‌ హాంక్స్‌ చేసిన పాత్ర, అతని ప్రవర్తన ‘స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి. అలా హాలీవుడ్‌కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్‌ లాంటి వాళ్ళు పేర్కొన్నారు.

రాజ్‌కపూర్‌ మనసు దోచిన సినిమా!‘షో మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ రాజ్‌కపూర్‌ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ మొదలు ఏ సినిమా తీసినా, బొంబాయిలో రాజ్‌కపూర్‌కు చూపించడం విశ్వనాథ్‌కు అలవాటు. అలాగే, ‘స్వాతిముత్యం’ చూశారు రాజ్‌కపూర్‌. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్‌ కపూర్, వెనక్కి తిరిగి విశ్వనాథ్‌తో, ‘‘మీరు నా హృదయాన్ని టచ్‌ చేశారు. దేర్‌ ఈజ్‌ ఎ లాట్‌ ఆఫ్‌ హానెస్టీ ఇన్‌ దిస్‌ ఫిల్మ్‌’’ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమలహాసన్, విశ్వనాథ్‌లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్‌ చేయాలనీ రాజ్‌కపూర్‌ ముచ్చటపడ్డారు. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమలహాసన్‌కు ఫోన్‌ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. ఏది ఏమైనా, కథ రీత్యా నేటికీ ‘స్వాతిముత్యం’ రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్‌ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని, విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహా ఘనత.

ఎన్టీఆర్‌ తర్వాత ఈ సినిమానే!రిలీజులో, రికార్డుల్లో కూడా ‘స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది. అది 1986. పదోతరగతి పరీక్షల సీజన్‌కు ముందు సినిమా కలెక్షన్లకు డల్‌ పీరియడ్‌గా భావించే మార్చి నెలలో ‘స్వాతిముత్యం’ రిలీజైంది. అన్‌సీజన్‌లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి, వసూళ్ళ వర్షం కురిపించింది. రజతోత్సవాలు చేసుకుంది. అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్‌ షోస్‌ అంటే రోజుకు 3 ఆటలే! ఉదయం ఆట ఏదైనా చిన్న, డబ్బింగ్‌ సినిమాలు ఆడడం ఆనవాయితీ. రిలీజ్‌ సినిమాకు హెవీ క్రౌడ్‌ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు. కానీ, ‘స్వాతిముత్యం’ అలా ఎక్స్‌ట్రా షోలతోనే ఏకంగా వంద రోజులు ఆడింది. అంతకు దాదాపు పదేళ్ళ క్రితం 1977 ప్రాంతంలో మొదలై ఎన్టీఆర్‌ 4 చిత్రాలు (‘అడవి రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’) మాత్రం తెలుగునాట ఇలా ఎక్స్‌ట్రా షోలతో, 4 –5 ఆటలతో వంద రోజులు ఆడాయి. అయితే, అవన్నీ మాస్‌ చిత్రాలు. వాటి తరువాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం – ‘స్వాతిముత్యం’. మచ్చుకి గుంటూరు ‘వెంకట కృష్ణా’లో రోజూ 4 ఆటలతో, తిరుపతి ‘వేల్‌ రామ్స్‌’లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది., ఓ పరభాషా నటుడి (కమలహాసన్‌)తో, నాన్‌కమర్షియల్‌ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది ‘స్వాతి ముత్యం’. వెండితెరపై విశ్వనాథ్‌ సమ్మోహనం అది. ఎప్పుడైనా సరే… కమర్షియల్‌ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా… కె. విశ్వనాథ్‌ , ఏడిద నాగేశ్వరరావుల ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్‌ ఉత్తమ దర్శకుడిగా, కమలహాసన్‌ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.