తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు అట్లీపై ఒక జూనియర్ నటి సంచలన ఆరోపణలు చేయటం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇళయ దళపతి విజయ్ 63వ సినిమాను అట్లీ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కు జూనియర్స్ గా వెళ్లిన తమను దర్శకుడు అట్లీ తనను దారుణంగా దూషించారని, అసభ్యంగా, అశ్లీలంగా ఆయన దూషణలు ఉన్నాయని ఆమె తాజాగా చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
అట్లీ తనను కుక్క కంటే హీనంగా చూసేవాడని ఆమె విమర్శించారు. రాజా-రాణి, తెరి, మెర్సల్ లాంటి విజయవంతమైన సినిమాలతో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన అట్లీపై ఈరకమైన ఆరోపణలు రావడం కోలీవుడ్ లో సంచలనం రేపుతోంది. ఆ కంప్లైంట్ లో ..ఏప్రిల్ 13న షూటింగ్ సెట్‌లో తనను అట్లీ ఘోరంగా దూషించాడని, అయినా ఎన్నికలు ఉండటం, ప్రభుత్వ సెలవులు ఉండటంతో ఈ విషయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదని ఆమె చెప్పుకొచ్చారు.
‘ఆహారం, సరైన టాయ్‌లెట్లు కావాలని మాత్రమే మేం సహాయ దర్శకులను అడిగేవాళ్లం. కానీ, అట్లీ, అతని సహాయ దర్శకులు మా విజ్ఞప్తిని పట్టించుకోకపోగా, మమ్మల్ని దూషించారు. అంతేకాదు, నన్ను షూటింగ్ స్పాట్ నుంచి బలవంతంగా తరిమేశారు’ అని ఆమె పేర్కొన్నారు. ఫుట్‌బాల్ నేపథ్యంతో తెరకెక్కుతున్న అట్లీ తాజా సినిమాలో విజయ్ సరసన నయనతార నటిస్తుండగా.. జాకీ ష్రఫ్, కదిర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
మరో ప్రక్క సెల్వ అనే షార్ట్ ఫిలింలు తీసే దర్శకుడు విజయ్ నటిస్తున్న 63వ చిత్ర కథ తనదంటూ చెన్నై హైకోర్టుకెక్కారు. అందులో మహిళా ఫుట్‌బాల్ క్రీడ ఇతి వృత్తంతో కూడిన కథను తాను 265 పేజీలు రాసుకున్నానని తెలిపారు. ఆ కథను పలువురు నిర్మాతలకు వినిపించానని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు అట్లీ ఈ కథను నటుడు విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్నారన్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. చిత్ర షూటింగ్‌పై నిషేధం విధించాలని పిటీషన్‌లో కోరారు.