అలా అడగటం నా పనిని అవమానించటమే: ‘యాత్ర’ డైరక్టర్

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలకంగా నిలిచిన పాద యాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కించారీ చిత్రాన్ని . ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 8న విడుదల అయ్యింది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండటం, సినిమా బాగుండటంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది.

అయితే ఈ చిత్రం కు రావాల్సినంత రెస్పాన్స్ సినీ పరిశ్రమనుంచి రావటం లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అభిమానులు సైతం బాధపడుతున్నారు. సాధారణంగా ఓ మంచి సినిమా రిలీజ్ అయితే స్టార్ డైరక్టర్ నుంచి స్టార్ హీరోలు దాకా అందరూ మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి ఎంకరేజ్ చేస్తూంటారు. అయితే ఇది రాజకీయ చిత్రం కావటం తో అందరూ సైలెంట్ అయ్యిపోయారు.

ఇదంతా గమనించిన కొంత మంది వైఎస్ అభిమానులు సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు తమ సినిమాను పొగడటం లేదని నొచ్చుకుంటున్నారు. ముఖ్యంగా వైఎస్ వల్ల లాభపడిన నాగార్జున, కృష్ణ కుటుంబంలోని వారు కూడా స్పందించకపోవడం వారిని బాధ కలిగిస్తోంది డైరక్ట్ గానే అంటున్నారు. ఎన్టీఆర్ సినిమాను ఆకాశానికి ఎత్తిన వారు తమ సినిమాను ఎందుకు పట్టించుకోవడం లేదని వారి ఆవేదన చెందుతున్నారు. దాంతో ఈ విషయాన్ని కులానికి అపాదించి సెలెబ్రిటీలపై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయమై దర్శకుడు స్పందించారు.

“నేను తీసిన సినిమా నా తరువాత కూడా బ్రతికి ఉంటుంది. అయితే ఇలా సెలెబ్రిటీలను ఈ సినిమాను పొగడమని అడగడం నా పనిని, నా జీవన శైలిని అవమానించడమే,” అని ఆయన ఒకింత ఘాటుగానే స్పందించారు.

“నా కంటే కూడా ఇది వైఎస్ గారి కథ. ఇలా అడగడం ఆయనకు నచ్చదు. ఇది ఆయనను అవమానించడమే. నేను జీవితం ఒకరినే అడుక్కుంటా. అది విశ్వాన్ని నాకు మంచి కథ ఇవ్వమని. విశ్వం ఆ విషయంలో నా మీద ఎప్పుడూ దయ చూపింది. ఆ తరువాత ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేదీ చెయ్యను,” అని అన్నారు మహి.

అయితే మహి ఇలా ఎమోషనల్ స్పందిస్తారని ఎవరూ ఊహించలేదు. ఇక ఈ చిత్రాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూడాల్సి ఉంది. ఇప్పటికే వైఎస్ సతీమణి విజయమ్మ చిత్రాన్ని తిలకించారు. ఈ వారంలో కుటుంబ సభ్యులతో కలిసి చూస్తారని సమాచారం.