స్టేజీపైనే నటి రోహిణిపై సీరియస్ అయిన ఇళయరాజా

మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా కొద్దిగా కోపం ఎక్కువే అని చెప్తారు. ఇప్పుడు అది .. ప్రముఖ నటి రోహిణికు అనుభవమైంది. ఆమెపై ఇళయరాజా కోప్పడుతున్న వీడియో ఒకటి సోషయ్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే… ఫిబ్రవరి 2న చెన్నైలో ఇళయరాజా పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శంకర్‌, సినీ నటుడు విక్రమ్‌ తదితరులు హాజరయ్యారు. వీరిద్దరూ స్టేజ్‌పైకి ఎక్కి ఇళయరాజా సంగీతం గురించి గొప్పగా ప్రసంగించారు. ఈ నేపథ్యంలో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రోహిణి శంకర్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘మీరు ఇళయరాజా సర్‌తో కలిసి ఎప్పుడు పనిచేస్తారు? అభిమానులు మీ ఇద్దరి కాంబినేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు’ అని అడిగారు.

https://twitter.com/DanknessTamil/status/1102279871382855680

దాంతో అక్కడే ఉన్న ఇళయరాజా రోహిణి అడిగిన ప్రశ్నకు కోపగించుకున్నారు. అందరూ చూస్తుండగానే.. ‘నువ్వు నాకు అవకాశం ఇప్పించాలని చూస్తున్నావా? ఇది నాకు నచ్చలేదు. అయినా ఇప్పుడు సినిమా గురించి ప్రస్తావన ఎందుకు? తనకు ఎవరితో కలిసి పనిచేయాలనిపిస్తే వారితోనే శంకర్‌ పనిచేస్తారు. ఇలాంటి ప్రశ్నలు అడిగి ఆయన్ని ఎందుకు డిస్టర్బ్‌ చేస్తావ్‌?’ అని మండిపడ్డారు. దాంతో రోహిణి కంగారుపడిపోయారు.

‘నా ఉద్దేశం అది కాదు సర్‌..’ అంటూ సర్దిచెప్పబోయారు.కాసేపటి తర్వాత రోహిణి అడిగిన ప్రశ్నకు శంకర్‌ సమాధానమిచ్చారు. ‘‘జెంటిల్‌మెన్‌’ సినిమా తీస్తున్నప్పుడు సినిమాకు సంగీతం అందించాల్సిందిగా ఇళయరాజా సర్‌ను అడగాలనుకున్నా. అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నా. నిజాయతీగా చెప్పాలంటే నాకు ఆయన్ను కలిసి పని గురించి అడగాలంటేనే భయం. ఇళయరాజా సర్‌ పట్ల నాకున్న గౌరవం, భయంతో నేను ఆయనతో కలిసి ఇప్పటివరకు పనిచేయలేదు తప్ప అంతకుమించి ఏమీ లేదు’ అని వెల్లడించారు శంకర్‌.