నేను ఎవరితోనూ లవ్‌లో లేను! -‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ నిధి అగర్వాల్
‘‘నటి అవ్వాలన్నది నా చిన్ననాటి కల. ఆ కల నెరవేరింది. ఇప్పుడు సినిమాలు హిట్ అవ్వడం పెద్ద బోనస్‌లా భావిస్తున్నాను. ‘సవ్యసాచి’ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. ‘మిస్టర్ మజ్ను’ రెస్పెక్ట్‌ని తెచ్చిపెట్టింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించింది’’ అని హీరోయిన్ నిధి అగర్వాల్ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్, నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల రిలీజ్ అయింది.
‘ఇస్మార్ట్ శంకర్’ నాకు తొలి మాస్ బ్లాక్‌బస్టర్‌ని అందించింది అంటూ పలు విశేషాలను పంచుకున్నారు నిధి అగర్వాల్. ఆమె మాటల్లోనే… సినిమా విడుదల రోజున విజయవాడలో ఉన్నాను. ఉదయం ఎనిమిదిన్నరకు దర్శకుడు చందు మొండేటిగారు ‘ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌కి కంగ్రాట్స్’ అంటూ మెసేజ్ పంపించారు. సినిమాకు రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ‘మిస్టర్‌మజ్ను’ తర్వాత పూరీ సార్‌ని కలిశాను. ఇందులో నీది సైంటిస్ట్ పాత్ర. ఇది సూపర్‌హిట్ ఫిల్మ్ నిధీ. నువ్వు చేయాలి అన్నారు పూరీగారు. ఆయన సినిమాకు నో ఎలా చెబుతాను? పూరీ సార్ గురించి నేను చాలా విన్నాను. ఆయన సినిమాలు చూశాను. ఆయనకి ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ సూపర్. నేను పని చేయాలనుకున్న దర్శకుల్లో ఆయన కూడా ఒకరు.
పెద్ద దర్శకుల సినిమాలతో మ్యాజిక్ జరుగుతుంది. పూరీగారి హీరోయిన్ అవడం లక్కీ అని ఫీలవుతున్నాను. రామ్‌తో వర్క్ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్. తనో స్వీట్‌హార్ట్. ఛార్మీగారు నిర్మాతగా సూపర్. చేయాలనుకున్న పనిని కచ్చితంగా చేస్తారు. పూరీగారు సెట్లో అందరితో ఒకేలా ఉంటారు. ఆయన చాలా స్వచ్ఛమైన మనిషి. చాలా కైండ్. సెట్స్‌లో చాలా సరదాగా అనిపించేది.
నా గురించి రామ్‌గోపాల్ వర్మగారు ట్వీట్ (సూర్యుడి కన్నా హాట్ అని నిధీని ఉద్దేశించి ట్వీట్) చేశారు. ఆయన తీసిన ‘రంగీలా’ సినిమాకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆ సినిమాలో పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటాను. నాకు కూడా ‘రంగీలా’ లాంటి సినిమా చేయాలనుంది. మంచి స్క్రిప్ట్, డైరెక్టర్ ఉంటే అలాంటి సినిమాలు చేసేయొచ్చు. ‘రంగీలా’ సినిమా గురించి పూరీగారితో ఓ రోజు సరదాగా షేర్ చేసుకున్నాను. తర్వాత వర్మగారు నా గురించి ట్వీట్ చేశారు. సో.. నేనేదంటే అది జరుగుతుంది . ప్రస్తుతం ‘జయం’ రవితో ఓ తమిళ సినిమా చేస్తున్నా. తెలుగులో వేరే చిత్రాలు అంగీకరించలేదు. ఇప్పుడైతే నేను ఎవరితోనూ లవ్‌లో లేను. సింగిల్‌గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది