మొద‌టిరోజు `సైరా` క‌లెక్ష‌న్స్ ఎంత‌?

చిరు మేనియా ఏ మాత్రం త‌గ్గ‌లేదుగా

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. 2017 సంక్రాంతికి `ఖైదీనంబ‌ర్ 150`తో ప్రేక్ష‌కుల ముంఉకొచ్చారు చిరు. ఆయ‌న నుంచి రెండేళ్ల విరామం త‌రువాత వ‌చ్చిన సినిమా కావ‌డంతో `సైరా`పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. చ‌రిత్ర పుట‌ల్లో మ‌రుగున ప‌డిపోయిన రేనాడు విప్ల‌వ యోధుడు ఉయ్యాల‌వాడ న‌రసింహారెడ్డి జీవిత‌క‌థని వెండితెర‌పై ఆవిష్క‌రించారు. దీంతో ఈ సినిమా ప్ర‌పంచ సినిమా దృష్టిని ఆక‌ర్షించింది. ఉయ్యాల‌వాడ పాత్ర‌లో చిరంజీవి ఒదిగిపోయి న‌టించిన తీరు ప‌లువురినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ బుధ‌వారం విడుద‌లైన ఈ సినిమా తొలి రోజు బాక్సీఫీస్ రిపోర్ట్ వ‌చ్చేసింది.
 
భారీ అంచ‌నాల మ‌ధ్య ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా తొలి రోజు 55 కోట్ల షేర్‌ని సాధించింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.  అందులో దేశ వ్యాప్తంగా 45 కోట్ల షేర్ వ‌సూలు చేయ‌డం మామూలు విష‌యం కాద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే వాస్త‌వ ఫ‌గ‌ర్స్‌ మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. హిందీ బెల్ట్‌లో `సైరా` ప్ర‌భావం బాగానే ప‌నిచేసింద‌ని, అమితాబ్ బ‌చ్చ‌న్ వుండ‌టం కూడా ఈ సినిమాకు ఉత్త‌రాదిలో చాలా వ‌ర‌కు ప్ల‌స్ అయ్యింద‌ని చెబుతున్నారు. బాలీవుడ్‌లో తొలి రోజు 5 కోట్ల వ‌సూళ్ల‌ని `సైరా`కొల్ల‌గొట్టింది. అయితే `వార్‌` చిత్రం డామినేష‌న్ ఇబ్బందిపెట్టింద‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇక వార్ తో పోలిస్తే హిందీ బెల్టులోనూ సైరాపైనా పాజిటివ్ టాక్ ఉండ‌డం ప్ల‌స్ కానుంది. తొలి రోజు థియేట‌ర్ల షేరింగ్ సైరాను త‌గ్గించింద‌న్న‌ది ఓ అంచ‌నా.
 
ఓవ‌ర్సీస్‌లోనూ `సైరా` మేనియా మామూలుగా లేదు. తాజా రిపోర్ట్ ప్ర‌కారం `సైరా` డీసెంట్ ఓపెనింగ్స్‌ని ఓవ‌ర్సీస్‌లో రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ఓవ‌ర్సీస్ షేర్ దాదాపుగా 10 కోట్ల వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. సినిమాని ప్రారంభించిన తీరు, చిరంజీవి న‌ట‌న‌, తెర‌కెక్కించిన తీరు, విజువ‌ల్ గ్రాండీయ‌ర్ వెర‌సి సినిమాని భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల‌కు ఈ చిత్రాన్ని రీచ్ అయ్యేలా చేశాయి, అదే ఈ సినిమాకు  రానున్న రోజుల్లో కాసుల వ‌ర్షం కురిపిస్తుంద‌ని, ఈ వారాంతంలో పెరిగే క‌లెక్ష‌న్లే దీనికి ఆధారం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బాహుబ‌లి 2.. సాహో చిత్రాల‌తో పోల్చి చూడ‌క‌పోతే సైరా వ‌సూళ్లు త‌క్కువేమీ కాదు. ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి ఇంత మంచి పాజిటివ్ టాక్ రావ‌డం అన్న‌ది ఇటీవ‌లి కాలంలో లేనే లేదు. తొలిరోజు క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చినా.. చాలా వ‌ర‌కూ పాజిటివ్ విష‌యాల్ని హైలైట్ చేయ‌డంతో అది కాస్తా సైరాకు క‌లిసొస్తోంద‌ని అంచ‌నా వేస్తున్నారు. తొలి వీకెండ్ వ‌సూళ్ల‌తో పాటు.. వ‌రుస‌గా ద‌స‌రా సెల‌వులు ఈ చిత్రానికి క‌లిసి రానున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.