ప్రతీ ఏడాది వైభంగా జరుపుకునే ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఈ ఏడాది 75వ ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు పేరిట పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్ణణ ప్రాంతంలోని వేడంగిపాలెంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సంగీత దర్శకులు కోటి, స్థానిక పాలకొల్లు ఎమ్మెల్యే నిర్మల రామానాయుడు పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి చిత్రలేఖ వ్యాఖ్యాతగా వ్వవహరించారు. గాయనీ, గాయకులు శ్రీకృష్ణ, రాహుల్, మానస, మేఘన, నటీనటులు గీతాసింగ్, జోష్ రవి, జితేంద్ర, జబర్దస్త్ ఫేం అప్పారావు తమ ఆట పాటలతో అలరించారు.ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ ఫేమస్ గాయని మంగ్లీ, పాపులర్ సింగర్ బేబి, సంతోషం అధినేత, నిర్మాత సురేష్ కొండేటి పాల్గొన్నారు. ఎంఎల్ ఏ చేతుల మీదు కోటి, బేబిలకు సన్మానం జరిగింది. ఇక మంగ్లీ పాడిన పాట వేడుకలో హైలైట్ గా నిలిచింది.
అనంతరం ఎమ్మెల్యే నిర్మల రామానాయుడు మాట్లాడుతూ, ` మన పాలకొల్లులో ఇంత పెద్ద ప్రొగ్రాం జరగడం..అందరిని ఆకర్షించడం అభినందించదగ్గ విషయం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో జరిగే కార్యక్రమానికి ఏ మాత్రం తగ్గకుండా ఎక్కడ ఈ ఈవెంట్ అద్భుతంగా జరిగింది. అదీ మొత్తం కార్యక్రమం సురేష్ కొండేటి గారి ఆధ్వర్యంలో జరగడం ఇక్కడి ప్రజల అదృష్టం. కోటి గారిని నా చేతులు మీదుగా సత్కరించే అవకాశం వచ్చినందకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నా` అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ, ` ఈరామాలయం ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిని. మా ప్రాంతానికి హైదరాబాద్ నుంచి ఇంత మంది విచ్చేసినందుకు వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నా. బేబి, కోటీ గార్లను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నా. తెలంగాణ ప్రాంతం నుంచి తొలిసారి ఆంధ్ర ప్రాంతంలో అడుగు పెట్టి ఈవెంట్ లో అద్భుతమైన పాటలు పాడిన మంగ్లీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు` అని అన్నారు.
ముఖ్యఅతిధి, సన్మాన కర్త కోటి మాట్లాడుతూ, ` సురేష్ కొండేటి మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చాను. ఇదే వేదిక పై సింగర్ బేబిని కూడా సత్కరించడం చాలా సంతో్షంగా ఉంది. నేను ఎంతో మందిని పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు బేబికి కూడా నా సహకారం పూర్తిగా ఉంటుంది. ఈచిన్న పల్లెటూరుకి బిజీగా ఉండే సింగర్స్ అంతా వచ్చి సక్సెస్ చేసినందకు అభినందనలు తెలుపుతున్నా` అని అన్నారు.
సింగర్ బేబి మాట్లాడుతూ, ` ఇప్పటివరకూ ఏ స్టేజ్ పై పాటలు పాడలేదు. సురేష్ కొండేటి గారి దయవల్ల వేదికపై పాట పడే అవకాశం దక్కింది. పెద్దలు, మిగతా సింగర్లు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. నా జీవితాంతం గుర్తుపెట్టుకునే లా కోటి గారు నన్ను ప్రోత్సహించారు. అలాగే చిరంజీవి గారు,సురేఖ అమ్మగారు తమ ఇంటికి పిలిపించి నన్ను అభినందించిన సంఘటన నా జీవితంలో మర్చిపోలేనిది. తర్వాత సురేష్ కొండేటి గారు తమ పత్రికలో నా ఇంటర్వూ ప్రచురిచించి అందరికీ తెలిసేలా చేసారు. వారందరికీ నా కృతజ్ఞతలు` అని అన్నారు.
గాయని మంగ్లీ మాట్లాడుతూ, ` ఆంధ్రా ప్రాంతానికి తొలిసారి రావడం ఇదే. మీరు ఇంతగా ఆదరిస్తారని తెలిసుంటే ఎప్పుడో వచ్చేదాన్ని. మీ అభిమానానికి కృతజ్ఞతలు. కోటి గారు, సురేష్ గారు, ఇంత మంది సింగర్స్ మధ్య పాటలు పాడే అవకాశం రావడం చాలా సంతోషంగాఉంది అని అన్నారు.