ఎంటర్టైన్మెంట్ యూనివర్శిటీ!
టాలీవుడ్ లో ఎంటర్ టైన్ మెంట్ యూనివర్శిటీలకు కొదవేమీ లేదు. రామానాయుడు స్టూడియోస్ .. అన్నపూర్ణ స్టూడియోస్.. అలాగే ఉస్మానియా లో ఫైన్ ఆర్ట్స్ సహా ప్రయివేటుగా బోలెడన్ని వినోద రంగానికి సంబంధించి శిక్షణా సంస్థలు ఉన్నాయి. అయితే ఈ రంగంలో అడుగు పెట్టేందుకు ప్రముఖ నిర్మాత.. కె.ఎల్.యూనివర్శిటీ అధినేత సత్యనారాయణ ఆసక్తి కనబరచడం విశేషం.
త్వరలో ఎంటర్‌టైన్‌మెంట్ యూనివర్శిటీని ప్రారంభిస్తామని ఆయన నోట వినిపించడం ఆసక్తిని రేకెత్తించింది. ఓవైపు విజయవాడ, హైదరాబాద్ లలో కె.ఎల్.యూనివర్శిటీ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపైనా కన్నేయడంపై సినీమీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన వారసుడిని హీరోగా ఎస్టాబ్లిష్ చేస్తూనే.. మరోవైపు ఇతర హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్ శర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన రాక్షసుడు (రాచ్చసన్ రీమేక్) చిత్రాన్ని ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ సినిమా సంగతులు సహా యూనివర్శిటీ సంగతుల్ని ముచ్చటించారు. కె.ఎల్.యూనివర్శిటీకి అనుబంధం గా ఎంటర్‌టైన్మెంట్ యూనివర్శిటీని ప్రారంభించే ఆలోచన ఉందని ప్రకటించారు. 1980లో కె.ఎల్.యూనివర్శిటీ ప్రారంభమైంది. ఇటీవలే హైదరాబాద్ బ్రాంచీని ప్రారంభించారు. ఇంజినీరింగ్ విద్యనందించడంలో నంబర్ వన్ యూనివర్శిటీగా కె.ఎల్.వర్మిటీ పాపులరైంది. ఓవైపు అలాంటి యూనివర్శిటీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కుమారుడు హవీష్ పై ప్రేమతో ఆయన సినీరంగంలోనూ ప్రవేశించారు.