హీరో విశాల్‌కు అరెస్టు వారెంట్‌

విశాల్ ఈ మధ్యకాలంలో వివాదాలకు ఎక్కువ లోనవుతుంటాడు అయితే టీడీఎస్‌ను సక్రమంగా చెల్లించని కేసులో ప్రముఖ సినీ నటుడు విశాల్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. విశాల్‌కు చెందిన ‘విశాల్‌ ఫిలిమ్‌ ఫ్యాక్టరీ’ కార్యాలయం చెన్నై వడపళనిలో ఉంది. ఐదేళ్లుగా ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఇచ్చిన వేతనాల్లో మినహాయించిన పన్ను (టీడీఎస్‌)ను సక్రమంగా ఆదాయ పన్ను శాఖకు చెల్లించలేదని, దానికి వివరణ ఇవ్వాలంటూ విశాల్‌కు గతంలో అధికారులు నోటీసులు పంపారు. దానికి సమాధానం ఇవ్వకపోవడంతో విశాల్‌పై చర్యలు చేపట్టాలంటూ ఎగ్మూరు కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అప్పట్లో దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు ఆగస్టు 2న విచారణకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలంటూ విశాల్‌ను ఆదేశిస్తూ సమను పంపింది. శుక్రవారం విశాల్‌ హాజరు కాలేదు. ఐటీ అధికారులు పంపిన నోటీసు విశాల్‌కు అందలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నేరుగా హాజరుకావడం నుంచి విశాల్‌కు మినహాయింపు కల్పించాలని కోరారు. దీనిని ఐటీ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. వాదనలు విన్న తర్వాత విశాల్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ను న్యాయమూర్తి జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 28 వ తేదీకి వాయిదా వేశారు.ఇంకా ఏమి జరగనుంది వేచి చూడాలి.