పెళ్లిపై నితిన్ మైండ్ సెట్ ఛేంజ్.. ఇంత‌లోనే ఏమైంది?

మ‌రో మూడు నెల‌లు ఆగాల్సిందేనా?‌

ఆగ‌లేక తొంద‌ర‌ప‌డున్నావా సుంద‌ర‌వ‌ద‌నా

క‌రోనా ఎవ‌రిని ఎలా వెంటాడి వేటాడుతున్నా.. పెళ్లి కొడుకుల‌కు మాత్రం కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. పెళ్లి కుదుర్చుకుని మూడు ముళ్లు వేయ‌లేక ఆపోసోపాలు ప‌డేలా చేస్తోంది. పాపం పలువురు టాలీవుడ్ హీరోల పెళ్లి క‌ల‌ల్ని క‌ల్లోలం చేసింది మ‌హ‌మ్మారీ. నిఖిల్ .. నితిన్.. రానా .. వీళ్లంతా క‌రోనా దెబ్బ‌కు దిగొచ్చారు. ఇది ఇప్ప‌ట్లో పోయే మ‌హ‌మ్మారీ కాద‌ని ముందే క్లారిటీకి వ‌చ్చేసిన నిఖిల్ వెంట‌నే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ముందే నిశ్చ‌యించిన తేదీకే పెళ్లాడేశాడు. ఒక‌సారి వాయిదా వేసినా వెంట‌నే స‌న్నివేశాన్ని అర్థం చేసుకుని తెలివైన ప‌ని చేశాడు.

అలాగే భ‌ళ్లాలుడు రానా కూడా ప్లాన్ ఛేంజ్ చేశాడు. ఆగ‌స్టులో ఎట్టి ప‌రిస్థితిలో మిహీకా బ‌జాజ్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిల‌వ్వాల‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్నాడు. అందుకు ఇరు కుటుంబాలు అంగీక‌రించాయి. ఎప్పుడో ఎక్క‌డో జ‌రిగే డెస్టినేష‌న్ వెడ్డింగ్ కంటే హైద‌రాబాద్ ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ లో సింపుల్ వెడ్డింగే బెట‌ర్ అని నిర్ణ‌యించుకున్నాడు.

ఇప్పుడు మ‌రో హీరో నితిన్ కూడా మైండ్ సెట్ మార్చుకున్నాడు. ఇలాగే వేచి చూస్తే ఇప్ప‌ట్లో పెళ్ల‌వ్వ‌దు. క‌రోనా ఎప్ప‌టికి పోతుందో ఎవ‌రికీ తెలీని ప‌రిస్థితి ఉంది. వ్యాక్సిన్ వ‌చ్చేప్ప‌టికే పుణ్యకాలం గ‌డిచిపోతుంద‌న్న బెంగ నితిన్ లో బ‌య‌ట‌పడింది. దీంతో ప్రేయ‌సి షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేసే ముహూర్తాన్ని ఫిక్స్ చేసేశార‌ని తాజాగా తెలుస్తోంది. ఏప్రిల్ లో అనుకున్న‌ది అవ్వ‌లేదు. ఆ త‌ర‌వాత అత్యంత వైభవంగా దుబాయిలో డెస్టినేషన్ వెడ్డింగ్ జ‌ర‌పాల‌ని కుటుంబం నిర్ణ‌యించింది. కానీ అదీ కుద‌రేట్టు లేదు. దీంతో ఓ మెట్టు దిగొచ్చి వ‌చ్చే నెల‌లో హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నితిన్ షాలిని జంట‌కు వివాహం జ‌రిపేందుకు నిశ్చ‌యించార‌ట‌. ఆషాడం పోగానే ఈ జంట పెళ్లి జ‌రుగుతుంది. పెళ్లి తేదీని అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ట‌. ఇప్ప‌టికే షూటింగుల్లేవ్. ఎలానూ ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ నుంచి సెట్స్ కెళ్లాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. కాబ‌ట్టి పెళ్లి తేదీని ప‌క్కాగా ప్లాన్ చేయ‌నున్నాడ‌ట‌.