అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆదారంగా ఒక చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. భారతదేశం గర్వించతగ్గ గాయకుల్లో ఒకరైన ఘంటసాల మరణించి నలభై సంవత్సరాలు అయినా ఆయన గానామృతం ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో మోగుతూనే ఉంది.
ఈ నేపధ్యంలో ఘంటశాల జీవితం రిసెర్చ్ చేసిన సిహెచ్ రామారావు ‘ఘంటసాల ది గ్రేట్’ టైటిల్ తో ఓ బయోపిక్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని వదిలారు.ఈ పోస్టర్స్‌ను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అయితే చూసినవారంతా అంత ఇంప్రెసివ్ గా లేవంటున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా ఉందంటే సినిమా ఎలా ఉంటుందో అని పెదవి విరుస్తున్నారు.
సీహెచ్ రామారావు దర్శకత్వంలో ఆయన సతీమణి లక్ష్మీ నీరజ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించి డైరక్టర్
రామారావు మాట్లాడుతూ … ‘‘ఘంటసాలగారి మీద ఆరాధనతో ఈ సినిమా తీశాను. మా కష్టాన్ని అభినందిస్తారనుకుంటున్నాను’’ అన్నారు.
ఇక ఘంటశాల గా కనిపిస్తున్న కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ‘‘నేను చాలా చిన్నవాణ్ని. మొదట ఈ సినిమా చేయకూడదనుకున్నా. ఇప్పుడు అలా ఎందుకు అన్నానా అనిపిస్తోంది. ఘంటసాలగారి పాటలు విన్నాం. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసు. ఈ సినిమాలో ఆయన వ్యక్తిత్వం తెలియజేస్తున్నాం’’ అన్నారు కృష్ణ చైతన్య దర్శకుడు.
అయితే మీడియాలో వచ్చిన వార్తలను బట్టి ఈ చిత్రం ఆపేయాలని ఘంటశాల కుటుంబం ప్రయత్నం చేస్తోందంటున్నారు. తమ తండ్రి జీవితాధారంగా సినిమా తీస్తున్నారన్న విషయం తమకు చెప్పలేదని చిత్ర యూనిట్ పై మండిపడుతున్నారు ఘంటశాల కుమారుడు,
సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రత్నకుమార్. సినిమా తీసేముందు తమను సంప్రదించలేదని, అనుమతి కూడా తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా బయోపిక్ తీయడాన్ని కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.