దేశంలోనే నెంబర్ వన్ ఫిలిం సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీని ఇటీవల ఫిలిం సిటీ అధినేత రామోజీరావు ఆర్ధిక ఇబ్బందులు కారణంగా అమ్మేసారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. మరికొంత మంది అమ్మడం కాదు డిస్నీ సంస్థకు మూడేళ్ల పాటు లీజుకు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఇంకొంత మంది ఫిలింసిటీ నష్టాల్లో ఉండటంతోనే రామోజీరావు అమ్మినట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు నష్టపోవడంతో రామోజీరావు తెలివిగా ముందుగానే జాగ్రత్తపడ్డారని ఇలా రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి.
అయితే ఈ ప్రచారాల్లో ఎంత మాత్రం నిజం లేదని తాజాగా యాజమాన్యం వివరణ ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా ముంబైలో షూటింగ్ లు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో జీ స్టూడియోస్- సోనీ గ్రూప్ తో పాటు ఇతర సినిమా, టీవీ సీరియళ్ల చిత్రీకరణ కోసం వాళ్లు వస్తామంటే యాజమాన్యం ఆహ్వానించింది! తప్ప అమ్ముకునే పరిస్థితుల్లో లేమని వెల్లడించింది. అద్దెకు ఇవ్వడం గానీ, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా అమ్మడం వంటి వార్తలను ఖండించింది. అయితే ఈ విధమైన ప్రచారం ఫిలిం జర్నలిస్ట్ మీడియా గ్రూపులు సహా పొలిటికల్ గ్రూప్ ల్లో జోరుగా వైరల్ అవ్వడంతో ఫిలిం సిటీపై ప్రచారం మరింతగా వేడెక్కింది.
దీంతో తాజా సమాచారాన్ని మేనేజ్ మెంట్, పీఆర్ఆర్ వర్గాలు మీడియాకు అందజేసాయి. అయితే రామోజీ ఫిలిం సిటీని ముంబైకి చెందిన చిత్రపరిశ్రమ పెద్దలు తెలివిగా షూటింగ్ లు చేసుకోవడానికి ముందే బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముంబైలో ఎక్కడా షూటింగ్ చేయడానికి వీలు పడదు. పైగా ఆ రాష్ర్టంలో కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే అంతా ముంబై వాళ్లకే కేటాయిస్తే టాలీవుడ్ సినిమా వాళ్ల పరిస్థితి ఏంటన్నది ఆలోచించాల్సిన విషయమే. అసలే భౌతిక దూరం పాటించి షూటింగ్ చేయాలి కాబట్టి! షూటింగ్ స్పాట్ లో చాలా స్థలం అవసరం ఉంటుంది. మనిషికి -మనిషికి మధ్య కనీసం 5 మీటర్ల దూరమైనా పాటించాలి.