SPBకి సీరియస్ అంటూ దారుణ ప్రచారంపై ఫ్యామిలీ ఆందోళన
గానగంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రమణ్యం (SPB) కోవిడ్ 19 పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఐసీయు- వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఎస్పీబీకి సీరియస్ అంటూ మీడియా చేసిన హడావుడి కుటుంబ సభ్యులు సహా అభిమానుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.
ఆయనకు ఏదో అయిపోతోంది! అంటూ కొన్ని మీడియాలు పనిగట్టుకుని ప్రచారం చేయడంతో కుటుంబీకులు హర్టయ్యారని తెలుస్తోంది. అంతేకాదు.. వెంటనే ఎస్.పి.బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్.పి.చరణ్ సహా ఆయన సోదరి మీడియా సమావేశంలో ఆ వార్తల్ని ఖండించారు. బాలు గారు కోలుకుంటున్నారు అంటూ ఓ ఫోటోని రిలీజ్ చేశారు. ఎస్పీబీ ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. త్వరలోనే కోలుకుని యథాస్థితికి చేరుకోనున్నారు. అభిమానులు ఆందోళన చెందవద్దని కుటుంబీకులు ప్రకటించారు. ఈ ఉదంతంపై కొన్ని మీడియాల ఆత్యుత్సాహాన్ని అంతా తప్పు పడుతున్నారు.
గతంలో సాటి నటులు సెలబ్రిటీల విషయంలో ఇలాంటి ప్రచారమే జరిగితే…. టీవీ కార్యక్రమాల లైవ్ సాక్షిగా ఎస్పీబీ ఆవేదనను వ్యక్తం చేస్తూ మీడియా సంయమనం పాటించాలని కోరారు. తప్పుడు ప్రచారం అత్యుత్సాహం తగదని చీవాట్లు పెట్టారు. కానీ ఇప్పుడు అలాంటి సన్నివేశం ఆయనకే ఎదురైంది. ఇక గతంలో కొందరు కమెడియన్ల విషయంలోనూ ఇలానే కొన్ని మీడియాలు అత్యుత్సాహం ప్రదర్శించాయి. బతికి ఉండగానే చనిపోయాడు! అంటూ స్క్రోలింగులతో హడలెత్తించారు. కమెడియన్ వేణుమాధవ్.. ధర్మవరపు సుబ్రమణ్యం.. ఏవీఎస్ .. ఎం.ఎస్.నారాయణ వంటి ప్రముఖులు ఈ తరహా బాధితులేనన్నది మరోసారి గుర్తుకు తెస్తున్నారు అభిమానులు.