అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట త్వరలో ప్రత్యేక చట్టం, నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు.. విషం చిమ్మేవారిపై ఉక్కుపాదం తప్పదు హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక.
సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రజలను తప్పుదోవ పట్టించి, అభద్రతా భావానికి గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. దీంతో పాటు, ప్రచారంలో ఉన్న వార్తల్లోని నిజానిజాలను ప్రజలకు వివరించేందుకు ఒక “నిజ నిర్ధారణ కమిటీ”ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
కృష్ణమ్మ ఉగ్రరూపం: ప్రకాశం బ్యారేజీకి పొంచి ఉన్న వరద ముప్పు!
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నాయని మంత్రి అనిత ఆరోపించారు. “వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా కొందరు పనిచేస్తున్నారు. అమరావతి మునిగిపోయిందని, విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయడం లేదని ఇష్టారీతిన అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు” అని ఆమె మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వార్తలను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు, అందుకు కారకులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విజయాలను చూసి ఓర్వలేకే దుష్ప్రచారం: కూటమి ప్రభుత్వం ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీలన్నీ విజయవంతంగా అమలు చేస్తుండటంతో ప్రతిపక్ష పార్టీ తట్టుకోలేకపోతోందని అనిత విమర్శించారు. “ఒక్క ఆగష్టు నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నేతన్నలకు-నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, స్త్రీశక్తి పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలను ప్రారంభించాం. ఈ అభివృద్ధిని చూసి తట్టుకోలేకే సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి దిగుతున్నారు. ఇది వారికి వారసత్వంగా వచ్చిన సమస్య” అని ఎద్దేవా చేశారు.
అసాంఘిక శక్తులను ఎలా అరికట్టాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసని, అలాంటి వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హోంమంత్రి అనిత తీవ్రంగా హెచ్చరించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ప్రత్యేక చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆమె తెలిపారు.



