జయప్రకాశ్‌రెడ్డికి  లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు 

గత 20 ఏళ్ళుగా సినీ, టి.వి., సాంస్కృతిక రంగాల్లో విశిష్ట ప్రతిభను కనబరిచిన కళాకారులను ఫిలిం ఎనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌) ఘనంగా సన్మానిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఫాస్‌-అక్కినేని 2018 అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఫాస్‌ అధ్యక్షులు, సంస్కృతిరత్న కె.ధర్మారావు. ఈ సందర్భంగా కె.ధర్మారావు కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ ”సెప్టెంబర్‌ 30 ఆదివారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం ఆడిటోరియం(నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు కళామందిరం)లో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విజయవాడ నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు సభను ప్రారంభిస్తారు. ఎ.పి.ఎస్‌.ఆర్‌.టి.సి. ఛైర్మన్‌ వర్ల రామయ్య అవార్డు గ్రహీతలను సన్మానిస్తారు. సంస్కృతిరత్న డా|| కె.ధర్మారావు అతిథులకు, అవార్డు గ్రహీతలను ఆహ్వానిస్తారు. ఫాస్‌ ఫెస్టివల్‌ చైర్మన్‌, శారద కళా సమితి అధ్యక్షులు కళారత్న డోగిపర్తి శంకరరావు స్వాగతోపన్యాసం చేస్తారు. ఈ సంస్థ అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు ఫాస్‌-అక్కినేని 2018 లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్న విలక్షణ నటులు జయప్రకాశ్‌రెడ్డి(జె.పి.)కి అందించనున్నారు. ఫాస్‌-అక్కినేని 2018 ప్రతిభా పురస్కారాన్ని ప్రముఖ నటుడు సంపూర్ణేష్‌బాబు అందుకుంటారు. ప్రముఖ నటులు మాణిక్‌ను ప్రత్యేక అవార్డుతో సత్కరిస్తారు. టి.వి. అవార్డుల్లో ఉత్తమ సినీ టి.వి. అవార్డును ఈటీవీకి, ఉత్తమ సంచలనాత్మక న్యూస్‌ టి.వి. అవార్డును టీవీ 9కి ప్రదానం చేస్తారు. అవార్డుల ప్రదానోత్సవానికి ముందు శ్రీసాయి లలిత మ్యూజిక్‌ అకాడమీ వారిచే అక్కినేని సినీ గీత లహరి నిర్వహించబడుతుంది. ఘంటసాల ఫేం వెంకట్రావు, శ్రీమతి లలితరావు మధురమైన గీతాలతో ఆహూతులను అలరిస్తారు” అన్నారు.