కుర్ర హీరోలకు విక్టరీ సవాల్ విసురుతున్నాడు!
అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ వయస్సు మీదపడుతున్నా హీరోగా మరింత జోరు పెంచుతున్నాడు. కుర్ర హీరోలకు సవాల్ విసుర్తూ, వయసుకు తగిన పాత్రలతో సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు. తన పాత్రలకు తగ్గట్టుగా ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ అందర్నీ తన వైపునకు ఆకట్టుకునేలా చేస్తున్నాడు. ఎఫ్2లో ‘వెంకీ ఈజ్ బ్యాక్’ అనే రేంజ్‌లో కామెడీని చూపించేశాడు. వెంకీ కామెడీ టైమింగ్‌లో ఏమాత్రం పదును తగ్గలేదన్న విషయం ఆ సినిమాతో రుజువైంది.
వరుస పరాజయాలతో ఒకదశలో పూర్తిగా వెనుకబడిన వెంకీ, కొంత గ్యాప్ తరువాత ఎఫ్2తో విజృంభించాడు. అదే ఊపులో వరుస ప్రాజెక్టుల్ని లైన్‌లో పెడుతున్నాడు. నాగ చైతన్యతో కలిసి ఫుల్లీ ఎంటర్‌టైనర్ ‘వెంకిమామ’ చేస్తోన్న వెంకీ, తరువాత ప్రాజెక్టునూ లైన్‌లో పెట్టాడట. ‘సినిమా చూపిస్త మామ’తో సినిమా చూపించిన నక్కిన త్రినాథ్‌రావు దర్శకత్వంలో మరో పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని టాక్. దాదాపు స్క్రిప్ట్ వర్క్ పూర్తవ్వడంతో, ఆగస్టులోనే సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రాజెక్టులో -నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తరహా కామెడీని చూపించబోతున్నాడట దర్శకుడు నక్కిన.
దీని తరువాత త్రివిక్రమ్‌తో వెంకీ ఓ ప్రాజెక్టు చేయనుండటం తెలిసిందే. త్రివిక్రమ్ -వెంకీ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనుండదు. వెంకీ బాడీ లాంగ్వేజ్‌ని దృష్టిలో పెట్టుకుని నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలను తన పెన్నుతో పైకెత్తిన త్రివిక్రమ్, వెంకీని డైరెక్ట్ చేస్తే ఇంకెలాంటి కామెడీని పుట్టిస్తాడో అంచనా వేసుకోవచ్చు. మొత్తానికి ఎఫ్2 వెంకీకి కొత్త ఊపునిచ్చిందన్న మాట. ఈ విషయం గురించి ఇటీవల కలిసిన వెంకటేష్ ను అడిగితే – నాకు వస్తున్న పాత్రలు, నేను నటిస్తున్న చిత్రాలు నా బాడీ లాంగ్వేజ్ కు దగ్గరగానే ఉంటున్నాయి. ఈ విషయంలో నేను తీసుకుంటున్న జాగ్రత్తలు అంతా ఇంతా కాదు. రాబోయే ప్రాజెక్టులు అన్నీ భారీ తారాగణంతో కూడుకున్నవే -అని చెప్పుకొచ్చాడు. దటీజ్ విక్టరీ !
