`చిరుత`నయుడి అరుదైన కానుక
తండ్రి 12 ఏళ్ల కలని తనయుడు తీర్చిన వేళ ఆ తండ్రి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. ఇప్పుడు అదే ఆనందాన్ని మెగాస్టార్ చిరంజీవి సొంతం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథని వెండితెరపై ఆవిష్కరించాలన్నది చిరంజీవి 12 ఏళ్ల కోరిక. ఆ కోరిక నేటితో తీరిపోయింది. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి ఆట నుంచే ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచి యునానిమస్‌గా హిట్ టాక్ రావడంలో మెగాస్టార్ ఆనందానికి హద్దు అన్నదే లేకుండా పోయింది. ఆ ఆనందం తండ్రి కొడుకులో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడం మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. తన కలని నేరవేర్చడమే కాకుండా తన కెరీర్‌లో మరపురాని విజయాన్ని `సైరా` రూపంలో అందించడంతో చిరు `చిరుత`నయుడిని ఆనందంతో ముద్దాడారు. ఆ ఫొటోని చిరు కోడలు ఉపాసన అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తండ్రి కలని నిజం చేయడం కోసం ఏ విషయంలోనూ రాజీపడకుండా పాన్ ఇండియా చిత్రాన్ని అందించి రామ్‌చరణ్ శభాష్ అనిపించుకున్నాడు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో చరణ్ ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా చాలా గ్రాండ్‌గా ఈచిత్రాన్ని నిర్మించాడని పొగడ్తల్లొ ముంచెత్తిన విషయం తెలిసిందే.