ఎవరు ఎంత చెప్పినా క్రేజ్ లో ఉన్న కాంబినేషన్ కు ఉన్న విలువ వేరు. మంచి ఓపినింగ్స్ వస్తాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతుంది. అదే ప్లాఫ్ ల్లో కాంబో కు తాము అనుకున్న రేటుకు అమ్మాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రస్తుతం పూరి, ఛార్మి అదే సమస్యలో ఉన్నారని తెలుస్తోంది.
గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ ప్లాఫ్ ల్లో ఉన్నారు. హీరో రామ్ ది అదే పరిస్దితి. దాంతో వారి కాంబోలో రెడీ అయిన సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ సమస్య వచ్చిందని ట్రేడ్ లో వినపడుతోంది. కాస్త రేట్లు తగ్గిస్తే ఈ సమస్య రాకపోను అని చెప్తున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ సినిమాకు మార్కెట్లో మంచి క్రేజే వచ్చింది. ట్రైలర్ కూడా బాగానే క్లిక్ అయ్యింది.
ఎనర్జిటక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఈ నెల 18న రిలీజ్ కు కు రెడీ అవుతోంది. పూరి జగన్నాథ్ సైతం ఈ సినిమాపై మంచి నమ్మకంగా ఉన్నారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘‘హైదరాబాదీ ఇస్మార్ట్ రౌడీ బుర్రలో పోలీసోళ్లు సిమ్ కార్డు పెట్టారు. అదెందుకో సినిమా చూసి తెలుసుకోవాలి. వినోదాత్మక కథ ఇది. రామ్ నటనే ప్రధాన ఆకర్షణ. ‘టెంపర్’ తరవాత నాకు మంచి హిట్టు పడలేదు. మంచి ఆకలితో ఉన్నప్పుడు రామ్ దొరికాడు. వెజిటీరియన్ ముసుగులో ఉన్న నాన్ వెజిటేరియన్ రామ్. తను రామ్ పోతినేని కాదు.. రామ్ చిరుతపులి. రామ్‌కి సినిమా తప్ప మరో ధ్యాస లేదు.
పార్టీలూ, ఫ్రెండ్స్ అంటూ ఉండవు. సహాయ దర్శకుడు పిలవకముందే షాట్లో దూకుతాడు. ప్రతి షాట్‌లో వంద శాతం ప్రతిభ చూపించాలనుకుంటాడు. మణిశర్మ మంచి పాటలు ఇచ్చారు. భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించారు. బోనాల పాట మరింత హిట్టయ్యింది. బోనాల సమయంలోనే మా సినిమా విడుదల అవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు.