త‌రుణ్ భాస్క‌ర్ నిర్ణ‌యం స‌రైన‌దేనా?

                                                               (ధ్యాన్)

ద‌ర్శ‌కుడుగా తొలి చిత్రం `పెళ్ళిచూపులు`తో సెన్సేష‌నల్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్‌. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ సాధించిన చిత్ర‌మిది. అంతే కాకుండా జాతీయ అవార్డుల‌ను కూడా గెలుచుకుంది. ఈ ద‌ర్శ‌కుడు డైరెక్ట్ చేసిన మ‌రో చిత్రం `ఈ న‌గ‌రానికి ఏమైంది`. ఈ సినిమా తొలి చిత్రం అంత కాకపోయినా.. నిర్మాత‌కు భారీ లాభాల‌నే తెచ్చిపెట్టింది. ఇప్పుడు త‌రుణ్ మూడో సినిమా ఎప్పుడా? అని ఎదురుచూస్తున్న‌వారికి చిన్న షాక్‌. అదేంటంటే.. త‌రుణ్ భాస్క‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌బోతున్నాడ‌ని ఇండ‌స్ట్రీలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను స్టార్ట్ చేస్తున్నాడు. అందులో భాగంగా తొలి చిత్రంలో త‌న‌కు బ్రేక్ ఇచ్చిన త‌రుణ్ భాస్క‌ర్‌ను హీరోగా చూపించ‌బోతున్నాడ‌ట‌. ఓ త‌మిళ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తార‌ట‌.  ఇంత‌కు ముందు `మ‌హాన‌టి`లో సింగీతం శ్రీనివాస‌రావు పాత్ర‌లో న‌టించిన త‌రుణ్ భాస్క‌ర్ పూర్తిస్థాయి క‌థానాయ‌కుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలి. అయితే ద‌ర్శ‌కుడిగా మంచి ట్రాక్‌లో వెళుతున్న‌ప్పుడు హీరోగా చేయ‌డం అనే నిర్ణ‌యం గురించి ఆలోచించుకుంటూ బావుంటుంద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.