దిమాకున్న డైరెక్టర్ ఈ రేసు గుర్రం
సైరా – నరసింహారెడ్డి లాంటి భారీ పాన్ ఇండియా సినిమాతో సినీవిశ్లేషకుల్ని ఆశ్చర్యపరిచాడు సురేందర్ రెడ్డి. రేసుగుర్రం- ధృవ- అతనొక్కడే లాంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్ని తెరకెక్కించిన ఈ దర్శకుడు ఒక కొత్త జోనర్ లోకి వెళ్లి హిస్టారికల్ క్లాసిక్ టచ్ తో పాన్ ఇండియా రేంజు మూవీని తీసి మెప్పించగలడని ఎవరూ అనుకోలేదు. ఎస్.ఎస్.రాజమౌళిని నమ్మినట్టే సురేందర్ రెడ్డిని అస్సలు నమ్మలేదు. కానీ తన గురించి అలా ఆలోచించిన వారి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ సైరా చిత్రాన్ని హాలీవుడ్ ప్రమాణాలతో తెరకెక్కించి సంచలనం సృష్టించాడు. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా హిందీ మార్కెట్లో ఆశించిన విజయం సాధించలేదు కానీ.. తెలుగులో మాత్రం బంపర్ హిట్ కొట్టింది. దాదాపు 280 కోట్ల మేర కలెక్షన్స్ తెచ్చిందని రామ్ చరణ్ ప్రకటించారు.
అయితే అలాంటి గొప్ప సినిమాని తీసాక కూడా అతడు ఏడాది పాటు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే అసలేమైంది? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. సైరా తర్వాత చరణ్ తో కానీ బన్నితో కానీ సినిమా చేస్తాడని ప్రచారమైంది. కాల క్రమంలో పవన్ కల్యాణ్ కి కథ చెప్పాడని కథనాలొచ్చాయి. కానీ దేనిపైనా సరైన క్లారిటీ లేదు.
ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సురేందర్ రెడ్డి ఫిక్సయ్యాడని తెలుస్తోంది. PSPK29 కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయగా ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ -ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 28వ సినిమా .. పీరియాడికల్ మూవీగా ఉంటుంది. ఆ తర్వాత 28వ సినిమాని హరీష్ శంకర్ తో చేస్తాడు. అటుపై 29వ సినిమా సురేందర్ రెడ్డితో ఉంటుందని సమాచారం. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక బన్ని కోసం చాలా ట్రై చేసిన సురేందర్ రెడ్డి అతడు సుకుమార్ కి కమిటవ్వడంతో పవన్ పై వంద శాతం ఫోకస్ చేసి సక్సెసయ్యాడని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.