డిజిటల్ ప్రొవైడర్ల లొల్లు మళ్లీ తెరపైకి!
డిజిటల్ టెక్నాలజీ ప్రతి పనినీ ఈజీగా మార్చేస్తోంది. అయితే ఎంత డిజిటల్ అభివృద్ధి చెందినా పైరసీని మాత్రం అరికట్టలేకపోతున్నారు. పైరసీపై రకరకాలుగా యుద్ధం జరుగుతూ ఉన్నా పూర్తిగా అరికట్టడంలో మాత్రం సనీపరిశ్రమలు విఫలమవుతూనే ఉన్నాయి. క్యూబ్ -యుఎఫ్‌వో -ఫిక్సలాయిడ్ లాంటి టెక్నాలజీలు వచ్చినా వీటన్నిటి ప్రొజెక్షన్ నుంచి పైరసీ కాపీలు వచ్చేస్తూనే ఉన్నాయి. ఆన్ లైన్ పైరసీ మాఫియాల్ని ఇవేవీ అడ్డుకట్ట వేయలేకపోయాయి. అయితే వీళ్లకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఓ కొత్త టెక్నాలజీతో పైరసీకి చెక్ పెట్టేస్తామని నిర్మాత కం డిజిటల్ టెక్నాలజీ ఫ్యాషనిస్టా బసిరెడ్డి చెబుతున్నారు. అందులో వాస్తవం ఎంత? పాజిబిలిటీ ఫీజబిలిటీ ఎంత? అన్నది అటుంచితే ప్రస్తుతం ఈ టెక్నాలజీ గురించి తెలుగు సినీపరిశ్రమలో ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు.
ఇకపోతే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య చాలా కాలంగా యుద్ధం నడుస్తోంది. ఒకరికొకరు పోటీపడుతూ థియేటర్ల మోనోపలికి తెర తీశారని ఇటీవల చర్చ సాగింది. పెరుగుతున్న సాంకేతికత వల్ల వీళ్ల మధ్య పోటీ కూడా ఇప్పుడు తీవ్రతరం అవుతోంది. అయితే క్యూబ్ -యుఎఫ్ వో వంటి వాటి ఆధిపత్యానికి గండి కొట్టాలని చూసిన వాళ్లెవరూ ఇప్పటివరకూ ఆ పని చేయలేకపోయారు. దానికి కారణం క్యూబ్ ప్రొజెక్షన్ వంటి వాటితో అల్లు అరవింద్ సహా ఆ నలుగురు లేదా ఆ పది మంది టాలీవుడ్ పెద్దల భాగస్వామ్యం ఉండడంతో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఓవైపు తక్కువ రేటుకే సర్వీస్ ప్రొవైడర్లు డిజిటల్ ప్రొజెక్షన్ టెక్నాలజీని అందిస్తామని వస్తున్నా దానిని ఎవరూ ఆమోదించలేని సన్నివేశం క్రియేట్ చేస్తున్నారట. ఇకపోతే ప్రస్తుతం నిర్మాత కం డిజిటల్ టెక్నాలజిస్టు బసిరెడ్డి `డీ సినిమా` పేరుతో 2కె రిజల్యూషన్ డిజిటల్ టెక్నాలజీని అభివృద్ధి చేసి నిర్మాతలు- ఎగ్జిబిటర్ లకు వెసులుబాటు ఉండేలా చేస్తామని అంటున్నారు. డీసినిమా పేరుతో దీనిని తెలంగాణ-ఏపీలో అన్నిచోట్లా థియేటర్లలో క్యూబ్ – యుఎఫ్ వోల స్థానంలో అభివృద్ధి చేద్దామని బసిరెడ్డి సన్నాహాలు చేస్తున్నారట. తాజాగా హైదరాబాద్ ఏఎంబీ సహా విజయవాడలోనూ ఆయన డీసినిమా ప్రొజెక్షన్ వేసి పలువురు ఇండస్ట్రీ ప్రముఖులకు ప్రదర్శించారు. దీనికి సానుకూల స్పందన వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం- తెలంగాణ ఎఫ్‌డీసీ నుంచి అతడికి సపోర్టు దక్కనుంది.
దుష్టశక్తులు ఆపుతాయ్ జాగ్రత్త!
అయితే బసిరెడ్డి తెచ్చిన ఈ ప్రపోజల్ ని ఈ మంచి పనిని ఆ నలుగురు అనే కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని తెలుస్తోంది. మరి డిజిటల్ లో ఈ యుద్ధం ఎంతవరకూ సక్సెసవుతుంది.. బసిరెడ్డి సఫలమవుతారా లేదా? అన్నది వేచి చూడాలి. అయితే థియేటర్ల మోనోపలిని టచ్ చేస్తే ఆ మేరకు అటువైపు నుంచి కూడా రియాక్షన్ అంతే వేగంగా ఉంటుందనడంలో సందేహం లేదు. మరి ఎన్నారై కం టెక్నాలజిస్ట్ బసిరెడ్డి టెక్నాలజీనీ అవతలివాళ్లు అడ్డుకోకుండా ఉంటారా? అన్నది చూడాలి.