ఆర్జీవీపై `పరాన్నజీవి` ప్రభావం ఎంత?
తాడిని తన్నేవాడొకడుంటే వాడి తలదన్నేవాడొకడొస్తాడని అంటారు. కానీ ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ తలదన్నే వేరొకడు టాలీవుడ్ లో పుట్టలేదు ఎందుకనో. అతడు తాను ఏం చేయదలిస్తే అది చేస్తున్నాడు. ఆటాడుతున్నాడు. తన శత్రువుల్ని చీల్చి చెండాడే కంటెంట్ ఎంచుకుని మరీ వేటాడుతున్నాడు. నేరుగా బయోపిక్ లు తీస్తాడు. కుదరకపోతే తక్కువ బడ్జెట్లో యూట్యూబ్ సినిమాలు.. ఏటీటీ సినిమాలు అంటూ నిరంతరం విరుచుకుపడుతూనే ఉన్నాడు. ఏం చేసినా దానిని సక్సెస్ చేస్తున్నాడు. చెత్త బూతు కంటెంట్ తోనే నెగ్గుకొస్తున్నాడు ఆర్జీవీ. ఆయనలా ఇంకొకరు చేయడం సంపాదించడం కూడా కష్టమే.
ఆర్జీవీ పోకడలు చాలా మందికి నచ్చవు. తమను టార్గెట్ చేస్తే భగభగ మండుతూనే ఉన్నారు. ఆర్జీవీతో పెట్టుకోవాలంటే ఇప్పుడు సినిమాలు తీయడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఇది ఆలోచించి తెలివిగా పవన్ అభిమానులు `పరాన్న జీవి` అనే సినిమా తీస్తున్నారు ఆర్జీవీపై. ఆర్.జీ.వీ పవర్ స్టార్ కు కౌంటర్ మూవీ ఇది. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో వేగంగా చిత్రీకరణ పూర్తవుతోంది. తాజాగా పరాన్నజీవి టైటిల్ సాంగ్ రిలీజై వైలర్ గా మారింది. ఇది పవన్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గానూ మారింది.
జీవి ఆర్జీవీ నిర్జీవి.. అంటూ సాగే ఈ పాటలో రామ్ గోపాల్ వర్మను తూట్లు పొడిచే లైన్లు ఎన్నో. ఆయన ప్రవర్తనను… నిస్సిగ్గుగా చేసే పనుల్ని అన్నిటినీ ప్రశ్నించారు. క్యారెక్టర్ బ్యాడ్ డైరెక్టర్ అన్న అర్థం వచ్చేలా లిరికల్ వీడియోని రూపొందించారు. అంతా నా ఇష్టం అంటాడు. తల్లి చెల్లి తేడా తెలీనోడు.. సర్వం నికృష్టం అంటూ ఆర్జీవీ శైలిని తిట్టే ప్రయత్నం చేశారు. కులాల బురద అంటిస్తాడని.. ఎదుటివారిపై బురద వేస్తాడని.. విమర్శించారు. అంతేకాదు పవర్ స్టార్ తో ఆడకు ఆట.. మొదలైనట్టే సింహపు వేట!! అంటూ ఆర్జీవీపై ఎటాక్ మొదలైంది.
అయితే ఈ పాట ఏ మేరకు ప్రభావం చూపించింది? అంటే.. అబ్బే అసలు అంతగా వర్కవుట్ కాలేదన్నది కొందరి మాట. పవన్ అభిమానుల్ని సంతృప్తిపరిచేదిగా ఉన్నా కానీ.. ఆర్జీవీ గురించి తెలిసిన వాళ్లెవరూ దీనికి పెద్దగా స్పందించిందేమీ లేదు. ఇదేదో అతడిపై కక్షపూరిత ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదనేస్తున్నారు. “గడ్డి తింటావా?` అంటూ ఆర్జీవీ `పవర్ స్టార్ సాంగ్` సాంగ్ మాత్రం జనాల పెదవులపై చిరునవ్వు తెప్పించి సక్సెసైంది. ఏదేమైనా సినిమాకి సినిమానే సమాధానం! అనే ఆలోచన మాత్రం మెచ్చదగినది. పవర్ స్టార్ పై పరాన్న జీవి పంతం నెగ్గుతుందా లేదా చూడాలి.