లాక్ డౌన్ నేపథ్యంలో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ RRR రిలీజ్ పై నీలి నీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తాత్కలికంగా షూటింగ్ లు అన్నీ బంద్ అయ్యాయి. ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది. కానీ వైరస్ విజృంభణ రోజు రోజు కి పెరుగుతోంది కానీ తగ్గు అన్నదే లేదు. దీంతో లాక్ డౌన్ పొడిగిస్తారా? లేక ఎత్తి వేస్తారా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ కారణంగా ఎక్కడ షూటింగ్ లు అక్కడే నిలిచిపోవడంతో తర్వాతి పనులు కూడా వాయిదా పడటం తప్పనిసరి అయింది. అదీ ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా వీఎఫ్ ఎక్స్ బేస్డ్ విజువల్ ట్రీట్ కాబట్టి మిగతా సినిమాల కన్నా అన్ని పనులకు ఎక్కువ సమయం పడుతుంది.
ఆ కారణంగా ఆర్.ఆర్.ఆర్ 2021 జనవరి 8న రిలీజవ్వడం కష్టమేనని సోషల్ మీడియాలో కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఇప్పటివరకూ ఎంత షూటింగ్ పూర్తయిందో కూడా మీడియాకి క్లారిటీ లేదు. ప్రమోషన్ విషయంలో జక్కన్న నీళ్లు నమలడంతో… ఇంటర్నల్ గా అసలేం జరుగుతుందో తెలియని సన్నివేశం నెలకొంది. తాజాగా ఈ కథనాలన్నింటిపైనా చిత్ర నిర్మాత డి. వి.వి దానయ్య క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో జనవరి 8న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అభిమానులు సహా ప్రేక్షకులు ఎలాంటి డౌట్లు పెట్టుకోవద్దు. ఆ తేదీని మిస్ అయ్యే ఛాన్స్ లేదంటూ బల్లగుద్ది మరీ ఓ జాతీయ మీడియా సంస్థకు చెప్పారు.
సినిమా పూర్తయిన వరకూ గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తయ్యాయని ఆయన అన్నారు. అన్నీ సవ్యంగా సాగుతుంటే ఎందుకు వాయిదా పడుతుంది? సోషల్ మీడియా లో వచ్చే కట్టు కథనాలను ఎవరూ నమ్మ వద్దని కోరారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ పై మరోసారి క్లారిటీ దొరికింది. వాస్తవానికి ఈ ఏడాది జులైలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ సహా ఇతర పనులు డిలే అవ్వడంతో జనవరి 8కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా పంచ్ నేపథ్యంలో అప్పటికి అయినా అయ్యే పనేనా? అంటూ డౌట్లు వ్యక్తమవుతున్నాయి.