విజయ్ ఫ్యాన్స్ తప్పుడు టీఆర్పీలపై బార్క్ ఫైర్
తమిళ స్టార్ హీరో .. ఇలయదళపతి విజయ్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇక ఇతర స్టార్ల అభిమానులతో పోలిస్తే విజయ్ ఫ్యాన్స్ లో అత్యుత్సాహం మరీ ఎక్కువ. తమ ఫేవరెట్ స్టార్ సినిమా వస్తోంది అంటే వీధుల్లో వీరవిహారం చేయడమే గాక ఫ్లెక్సీ ప్రచారంతో దంచి కొడతారు. అంతేకాదు వివాదాస్పదమైన ఎన్నో పరిణామాలకు కారణమవుతుంటారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇమేజ్ కూడా బహుశా ఈ వివాదాలకు కారణం కావొచ్చు.
తాజాగా విజయ్ ఫ్యాన్స్ ఎరక్కపోయి ఇరుక్కుపోయారు. తమ ఫేవరెట్ హీరో విజయ్ నటించిన సినిమాలకు అద్భుతమైన టీఆర్పీ దక్కిందని .. లాక్ డౌన్ సమయంలో మావోడి సినిమానే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజానీకం వీక్షించిందని లెక్కలు చెబుతూ ఓ పోస్టర్ ని ముద్రించారు. ఇందులో ఇలయదళపతి విజయ్ నంబర్ వన్ స్థానంలో నిలవగా రెండో స్థానంలో లారెన్స్.. మూడో స్థానంలో రజనీకాంత్ నాలుగో స్థానంలో ప్రభాస్ ఐదో స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నారని వెల్లడించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. 117 మిలియన్ వ్యూస్ తో విజయ్ టాప్ పొజిషన్ కి చేరుకున్నాడట.
అయితే ఇది నిజమా? అంటే బార్క్ వాళ్లు చెబుతున్నది వేరేగా ఉంది. ఇదంతా తప్పుడు ప్రచారం. ఇలాంటిది మేం ఎక్కడా నివేదించలేదు. బార్క్ అధికారిక వెబ్ సైట్లో ఉన్నవే నమ్మండి అంటూ ఖండించారు. వీటిని ప్రజలు నమ్మొద్దని బహిరంగంగా సామాజిక మాధ్యమాల్లో బార్క్ ప్రతినిధులు వెల్లడించడంతో మరోసారి స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ దొరతనం బయటపడిపోయింది. ఇది దొరతనమా లేక తప్పుడు అలవాటా? అంటూ ఇతర స్టార్ల ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాల్లో చెలరేగుతున్నారు. అయినా ఇంత అత్యుత్సాహం అవసరమా? అనవసరంగా దళపతికే బొప్పి కట్టించేశారు! అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.