రానా దగ్గుబాటి ఓ ఇంటివాడవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నా.. కళ్యాణ ఘడియలు సమీపించాయి. రానా నటిస్తున్న బహుభాషా ప్రాజెక్ట్ లు సైమల్టేనియస్ గా చిత్రీకరణల్లో ఉన్నాయి. వీటిలో అరణ్య చిత్రీకరణ పూర్తయింది. అన్ని పనులు పూర్తి చేశారు. ఏప్రిల్ 2 న విడుదల కావాల్సి ఉండగా.. కరోనావైరస్ భయం నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడింది. మహమ్మారీ వల్ల రిలీజ్ ఆలస్యమవుతోంది కాబట్టి నెట్‌ఫ్లిక్స్ లో ప్రత్యక్ష ఆన్‌లైన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారమైంది.
అయితే ఆ వార్తల్ని తాజాగా రానా ఓ ఇంటర్వ్యూలో ఖండించారు. థియేట్రికల్ రిలీజ్ కోసమే వేచి చూస్తామని రానా స్పష్టం చేశారు. రానా కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆరణ్య ఒకటి. ఈ సినిమాని థాయ్‌లాండ్, శ్రీలంక, కేరళలోని దట్టమైన అడవులలో చిత్రీకరించారు. పుల్ కిత్ సామ్రాట్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావ్కర్ ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. అడవులు.. స్మగ్లింగ్.. ఏనుగుల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ రేపే చిత్రమిది.