జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలీదని వ్యాఖ్యానించిన బాలీవుడ్ నటి మీరా చోప్రాపై అభిమానుల వీరంగం తెలిసిందే. తమ ఫేవరెట్ స్టార్ ని మీరా అలా లైట్ తీస్కోవడంతో సీరియస్ అయిన ఫ్యాన్స్ తనపై అసభ్యకర పదజాలంతో దూషణల ఫర్వానికి దిగారు. సామూహిక అత్యాచారం చేస్తామని.. యాసిడ్ దాడులు చేస్తామని.. చంపేస్తామని రకరకాలుగా హెచ్చరించడంతో అది కాస్తా సీరియస్ అయ్యింది.
నిన్నటిరోజున మీరా చోప్రా నేరుగా ఎన్టీఆర్ నే ఈ విషయంపై నిలదీసే ప్రయత్నం చేసింది. ఇలాంటి చెత్త ఫ్యాన్స్ వల్ల నంబర్ వన్ ఎలా అవుతావ్? అంటూ తారక్ ని నిలదీసింది మీరా. ఇక తనని డీగ్రేడ్ చేస్తూ ట్విట్టర్ లో తారక్ ఫ్యాన్స్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే ఈ దూషణల ఫర్వానికి చెక్ పెడుతూ మీరా చోప్రా నేరుగా సైబరాబాద్ పోలీసులకు ట్విట్టర్ మాధ్యమంలో ఫిర్యాదు చేసారు. అలాగే జాతీయ మహిళా కమీషన్ కి ట్వీట్ ద్వారా తన వ్యథను చెప్పుకున్నారు. దీంతో సీరియస్ అయిన మహిళా కమీషన్ వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసుల్ని కోరింది.
బుధవారం నాడు తారక్ ఫ్యాన్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్.ఐ.ఆర్ సిద్ధం చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. మీరా చోప్రాపై దూషణలకు దిగిన తారక్ అభిమానులు ఎవరెవరు? అన్నదానిపైనా ఆరాలు తీస్తున్నారు. సోషల్ మీడియాల్ని వెరీఫై చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టమని పోలీసులు చెబుతున్నారు. మీరా చోప్రా షేర్ చేసిన స్క్రీన్ షాట్ల ఆధారంగా దర్యాప్తు సాగుతోంది.
భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 506 (క్రిమినల్ బెదిరింపు).. 509 (ఒక మహిళను అవమానించడం) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో మీరా చోప్రాను శృంగార తార అంటూ తారక్ అభిమానులు వ్యాఖ్యానించడంపైనా సీరియస్ గానే ఉంది మ్యాటర్.