సెలబ్రిటీలు ప్రైవసీ కోరుకోవడం ఎంత సహజమో.. ఆ ప్రైవసీని నాశనం చేయాలనుకోడం జర్నలిస్టులకు అంతే కామన్. ఎవరు కరెక్ట్.. ఎవరు రాంగ్ అంటే ఎవరూ చెప్పలేరు. సెలబ్రిటీలకు ప్రైవసీ కావాలి. జర్నలిస్టులకు సెలబ్రిటీ ఫోటోలు వీడియోలు కావాలి. చీవాట్లు తిట్లు తిని అయినా, లేదూ దెబ్బలు తిని అయినా రిస్కులు చేసి మరీ అవి తేవాలి. అది వృత్తిలో భాగం. అయితే అలా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫోటోలు, వీడియోలు తీసినందుకు ఓ జర్నలిస్టుకు వీపు విమానం మోత మోగిందట. సల్మాన్ భాయ్ అతడి చేతి నుంచి ఫోన్ లాక్కోవడమే గాక దాని నుంచి ఓ రెండు వీడియోల్ని తొలగించేశాడు. ఆ తర్వాత భాయ్ సెక్యూరిటీ గార్డులు అతడిపై తలో చెయ్యేశారు. సైకిల్ పై వెళుతున్న అతడికి కార్ లో వెళుతున్న పెద్ద దొర దాష్ఠీకం ఎలా ఉంటుందో తెలిసొచ్చిందట.
ఇదే విషయాన్ని అంధేరిలోని ఓ కోర్టులో మొర పెట్టుకున్నాడు జర్నలిస్టు అశోక్ పాండే. ఏప్రిల్ 24న ఈ ఘటన జరిగితే అదేరోజు అంధేరి డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు దానిని స్వీకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో న్యాయం కోసం తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని చెబుతున్నారు. ఈ కేసులో నిజానిజాలేంటో నిగ్గు తేల్చాల్సిందిగా పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. గాయపరిస్తే ఐపీసీ సెక్షన్ 323, ఫోన్ లాక్కుంటే 392, నేరానికి పాల్పడితే ఐపీసీ 506 చట్టాల ప్రకారం శిక్షలు ఉంటాయి. ఆ మేరకు సల్మాన్ పై ఈ అభియోగాల్ని మోపారని తెలుస్తోంది.