స‌ల్మాన్ ఖాన్ సోద‌రుల‌పై ఎఫ్ఐర్ న‌మోదు.. ఇంత నిర్ల‌క్ష్యం ఏంటంటున్న నెటిజ‌న్స్

వ‌డివ‌డిగా ప‌రుగులు పెడుతున్న ప్రపంచానికి క‌రోనా మ‌హ‌మ్మారి బ్రేకులు వేసిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా వల‌న ఎంద‌రో రోడ్డున ప‌డ్డారు. చాలా రంగాల‌కు న‌ష్టాలు వాటిల్లాయి. చాలా మంది జీవితాలు దుర్భ‌రంగా మారాయి. ఇక ఇప్పుడిప్పుడే క‌రోనా కాస్త ఉప‌శ‌మ‌న‌మివ్వ‌డంతో అన్ని ప‌నులు సజావుగా జ‌రుగుతున్నాయి అనుకుంటున్న టైంలో కొత్త ర‌కం కరోనా పుట్టుకొచ్చింది. దీంతో ప్ర‌జ‌లతో పాటు ప్ర‌భుత్వాలు అల‌ర్ట్ అయ్యాయి. యూకేలో పుట్టిన కొత్త క‌రోనాని మ‌న‌దేశంలో రానివ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నప్ప‌టికీ, మ‌న దేశంలోనే కాక రాష్ట్రంలోను స్ట్రెయిన్ పంజా విసురుతుంది.

కొత్త ర‌కం క‌రోనాని కాస్త అయిన కంట్రోల్ చేయాల‌ని ప్ర‌భుత్వాలు విదేశాల నుండి వ‌చ్చే వారిపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో పాటు వారం పాటు వారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నారు . బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ సోద‌రులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్‌ల‌తో పాటు సోహైల్ కుమారుడు నిర్వాన్ ఖాన్ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 25న దుబాయ్ నుండి ముంబై తిరిగి వ‌చ్చారు.

వారికి పరీక్ష‌లు జ‌ర‌ప‌గా క‌రోనా నెగెటివ్ అని తేలింది. అయిన‌ప్ప‌టికీ వారం రోజుల పాటు ఐసోలేష‌న్ ఉండాలని చెప్పిన విన‌కుండా బాంద్రాలోని సొంతింటికి వెళ్ళారు. దీనిపై బీఎంసీ వైద్య అధికారి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేశారు.కొవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారం దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురూ ఒక హోటల్‌లో ఉండ‌మ‌ని చెప్పిన‌ప్ప‌టికీ, విన‌కుండా వారి సొంతింటికి వెళ్ళారు అని బీఎంసీ అధికారి కేసు న‌మోదు చేశారు. దీంతో విచార‌ణ జ‌రిపిన పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్టు తెలుస్తుంది. అయితే మాకు జ‌రిపిప పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని రావడంతో తాము ఇంటికి వచ్చామని సోహైల్ ఖాన్ అంటున్నారు.