రాశి, రంభలతో ఆ యాడ్స్‌ వద్దు, తేల్చిన కోర్ట్

మాజీ సినీ హీరోయిన్స్ రాశి, రంభ లాంటి వాళ్లతో టీవీ ఛానెల్స్ లో కలర్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న ప్రకటనలను వెంటనే ఆపేయాలని విజయవాడ వినియోగదారుల ఫోరమ్ కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది.

ఈమేరకు దాఖలైన ఫిర్యాదుపై విచారణ అనంతరం నష్టపోయిన బాధితునికి అతని సొమ్ము తిరిగి చెల్లించడంతో పాటు 5వేల రూపాయలు పరిహారం, వినియోగదారుల సంక్షేమ నిధిగా 2లక్షలు చెల్లించాలని కలర్స్ సంస్థను ఆదేశిస్తూ ఫోరం జడ్జి ఆర్ మాధవరావు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించారు.

వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు ప్రోత్సహిస్తే సినీతారలకు కూడా భారీ జరిమానా విధిస్తామని కోర్టు స్పష్టం చేసింది.బాపట్లకు చెందిన ఎం సత్యవతిదేవి టీవీలో రాశి, రంభ ప్రకటనలు చూసి బరువును తగ్గించేందుకు కలర్స్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ విజయవాడ బ్రాంచిని సంప్రదించారు. బరువు తగ్గించేందుకు కావాల్సిన చికిత్సకు నిర్వాహకులు చెప్పినవిధంగా రూ. 78,652 వేలు చెల్లించారు.

చికిత్స ప్రారంభించిన కొద్దిరోజుల తర్వాత ఆహార అలవాట్లు మార్చుకోవాలని వారు సూచించారు. దీంతో బాధితురాలు శారీరక, మానసిక ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. కలర్స్ చికిత్సా విధానం నచ్చని సత్యవతిదేవి తాను చెల్లించిన నగదు తిరిగి ఇవ్వమని కోరింది. కొంతకాలం జాప్యం చేస్తూ వచ్చిన నిర్వాహకులు తర్వాత ఇవ్వమని తేల్చాశారు.

దీంతో బాధితురాలు న్యాయవాదిని సంప్రదించి నోటీసు ఇవ్వగా స్పందించకపోవడంతో కలర్స్ సంస్థ విజయవాడ బ్రాంచి నిర్వాహకురాలు మెట్ల జయని, కన్సల్టెంట్ చంద్రకళ, స్లిమ్మింగ్ మేనేజర్ నళినిపాల్, మేనేజింగ్ డైరెక్టర్‌లను ప్రతివాదులుగా చేరుస్తూ వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేశారు.

విచారణలో వాదనలు ఆలకించిన ఫోరం కలర్స్ సంస్థ చికిత్స విధానాన్ని తప్పుపట్టింది. ఈ తరహా చికిత్సలు వైద్యపరమైనవో, కాదో తెలియడం లేదని, సంబంధిత శాఖల అనుమతి కూడా లేదనే అభిప్రాయానికి వచ్చి బాధితురాలి సొమ్ము 9శాతం వడ్డీతో చెల్లించడంతో పాటు 5వేలు పరిహారంగా ఇవ్వాలని, వినియోగదారుల సంక్షేమ నిధికి 2లక్షలు చెల్లించాలని తీర్పుచెప్పింది.

అయితే వాస్తవాలు తెలుసుకోకుండా ఈ తరహా ప్రకటనలను సినీతారలు ప్రోత్సహించరాదని సూచిస్తూ ఇకనుంచి కొత్త చట్టం కింద వారికి కూడా భారీ జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయమూర్తి హెచ్చరించారు.