చంద్రబాబు ఇన్‌సెప్షన్‌తో సీమ-ఉత్తరాంధ్రకు తలనొప్పి?
కలల్లోంచి కలల్లోకి వెళ్లడం అక్కడ ఐడియాల్ని దొంగిలించడం లేదా లాకర్ తాళాల(కీ)ను కొట్టేయడం .. కలలోంచి బయటికి వచ్చాక గొప్ప గొప్ప సామ్రాజ్యాల్ని సైతం కుప్ప కూల్చేయడం .. ఇదీ బేసిగ్గా ఆస్కార్ మూవీ ఇన్ సెప్షన్ కథ. ఈ ఒక్క సినిమాతో క్రిస్టోఫర్ నోలాన్ పేరు వరల్డ్ వైడ్ మారుమూల పల్లెలకు కూడా తెలిసొచ్చింది. ఇన్ సెప్షన్ సినిమా తరహాలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న డొల్ల ప్రయత్నం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అసలు కల ఏది? భ్రమ ఏది? అన్నది తెలుసుకోలేని రీతిలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి.
భ్రమరావతి విజువల్ మాయలో పడి ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారని ఇన్నాళ్లు నమ్మిన చంద్రబాబు అది కలో నిజమో తెలీక కన్ఫ్యూజన్ కి గురయ్యారు. ఆయన ఇంకా కలలోంచి బయటకి వచ్చారో లేదో తెలీని ఆందోళన కనిపిస్తోంది. ఒకవేళ ఆయన కలలోంచి ఇహలోకానికి వచ్చి అనుకున్నవన్నీ సాధించగలిగితే అటుపై ఏం జరుగుతుంది? అన్న సినిమా తీస్తే ఆ సినిమా ఇన్ సెప్షన్ సీక్వెల్ ని మించి నోలాన్ ఆలోచనల్ని మించినంత ఆసక్తికరంగా ఉంటుంది.
ఒక కలలోంచి మరో కలలోకి వెళ్లడం.. ఆ రెండో కలలో ఉండగానే మూడో కలలోకి దారి వెతకడం.. అక్కడ ఏదైనా ఐడియా బెడిసి కొట్టి తేడా జరిగితే ఏకంగా ఇన్ సెప్షన్ (అనంతమైన కలలు) లోకంలోకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు అయోమయ పరిస్థితి కూడా అలానే ఉన్నట్టుంది. ఒకవేళ చంద్రబాబుకే అనుకూలంగా సుప్రీంకోర్టు- హైకోర్టు మూడు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే అటుపై ఏం జరుగుతుంది? అన్నది ఇన్ సెప్షన్ లో ఊహిస్తే.. అదెలా ఉంటుంది? అంటే.. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కలలు గంటున్న 2.5 కోట్ల మంది ప్రజలు మాత్రం ఇక ఎప్పటికీ చంద్రబాబును దరికి రానివ్వరు. ఎందుకంటే అతడు ఉత్తరాంధ్ర ద్రోహిగా ముద్ర వేయించుకున్నాడు ఇప్పటికే. అసలు వైజాగ్ లో అడుగు పెట్టాలంటేనే భయపడి చస్తున్నాడు. అందుకే ఈ ప్రాంతంలో కేవలం తెలుగు దేశం కార్యకర్తలు నాయకుల ఓట్లు మాత్రమే తేదేపాకు మిగులుతాయి.
అటు రాయలసీమలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంటుంది. ఒక్క అమరావతి – గుంటూరు బెల్టులో ఓట్లు పదిలం. అలాగే రాజధానికి భూములిచ్చిన ఆ 29 గ్రామాల ప్రజలు ఈ బాధలో తప్పనిసరి పరిస్థితిలో చంద్రబాబుకు ఓట్లు వేస్తారేమో కానీ.. అది కూడా ఇన్ సెప్షన్ లో అయితే కష్టమే. ఎందుకంటే అక్కడ కూడా జగన్ భ్రమరావతి విజువల్ ని వాడి స్మార్ట్ సిటీ బాణం వదిలి కచ్ఛితంగా ఆ ఓట్లు కూడా తనవైపు లాగేసుకోవడం ఖాయం. ప్రజలకు ఏనాడూ పది పైసలకు అయినా పనికిరాని తెలివితేటలతో భ్రమరావతి అనే ఒక అతి గొప్ప రియల్ ఎస్టేట్ భ్రమను సాధించుకోబోయి దారుణాతి దారుణంగా దెబ్బ తిని ఉన్న చంద్రబాబును ఇక ఉత్తరాంధ్ర-రాయలసీమలో దరికి చేరనివ్వరన్నది మేధావులందరూ ఊహిస్తున్న ఏకైక సత్యం. ఎలానూ ఇప్పటికే తేదేపా కీలక నాయకులంతా వైకాపా లేదా భాజపాలోకి క్యూ కట్టడం వెనక ఇలాంటి మీనింగ్ ఉందేమో.
అప్పటికీ కోర్టు తీర్పులేవైనా బాబుకు అనుకూలంగా ఉన్నా రాబోవు ఎన్నికల్లో జగన్ పంతమే గెలిచి 3రాజధానులు ఏర్పాటు చేస్తే.. కోర్టులు కూడా తప్పుడు తీర్పులిచ్చాయని ప్రూవ్ అయినట్టే. ప్రజా తీర్పు ముందు కోర్టుల తీర్పు ఓటమి పాలైనట్టు. ఎందుకంటే ఇన్ సెప్షన్ ప్రభావమే అంత దారుణంగా పని చేస్తోంది జనం మెదళ్లపై. ఇప్పటికే వైజాగ్ రాజధాని అనగానే విశాఖ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. కాకినాడ- వైజాగ్ మొదలు విజయనగరం – శ్రీకాకుళం వరకూ కారిడార్ల నిర్మాణం కోసం సీఎం జగన్ భారీగా కసరత్తులు చేయడం పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఆ ప్రాంత వాసులంతా ఇప్పటికి ఇన్ సెప్షన్ లోనే ఉన్నారు. భారీగా రోడ్లు .. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ మెట్రో రైల్ ప్రాజెక్టు.. 150 కిలోమీటర్ల మేర బీచ్ పరిసరాల్లో ట్రామ్ ట్రెయిన్ అంటూ ఒకటే ఊరించేశారు. బీచ్ పర్యాటకం .. పోర్టులు .. హార్బర్లు అంటూ వేడెక్కించేస్తున్నారు.
ఇక రాయలసీమకు అత్యవసరమైన హైకోర్టు కోర్టుల విభాగాన్ని తరలించడం కూడా అక్కడ ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తోంది. మూడో రాజధాని పేరుతో కరువు కాటకాల గడ్డకు ఆ కరువును వదిలిస్తారని .. భారీగా నదీజలాల్ని తరలించి భారీ రోడ్లతో మహానగరాల్ని అనుసంధానించి .. ఉక్కు ఫ్యాక్టరీలు నెలకొల్పి ఏదేదో చేస్తారని అక్కడ ప్రజలు కూడా ఇన్ సెప్షన్ లోనే ఉన్నారు. అందుకే ఈ ఇన్ సెప్షన్ నుంచి ఇప్పట్లో బయటకు రావడం అన్నది కుదరని పని. 2024 ఎన్నికల్లో జనం చూపు అమరావతి బెల్ట్ మినహాయిస్తే అన్నిచోట్లా మళ్లీ వైయస్ జగన్ వైపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రజా సంక్షేమం పేరుతో నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకే డబ్బును బదలాయిస్తున్న వేరొక ప్రభుత్వం లేదు కాబట్టి .. ఆమాత్రం మోచేతి కింద నీళ్లు తాగిన ప్రజలు ఓట్లు వేయకపోతారా? అన్న ఇన్ సెప్షన్ కూడా బలంగానే పని చేస్తోంది. మొత్తానికి అన్ని ఇన్ సెప్షన్లకు ఫైనల్ రిజల్ట్ ఏలా ఉండబోతోంది? అన్నదానికి రాబోవు ఎన్నికల్లోనే క్లారిటీ వస్తుందేమో!! అంతకుముందే మున్సిపోల్స్ లాంటివి కొంతవరకూ క్లారిటీనివ్వొచ్చు. అసలు ఇన్ సెప్షన్ లో ఉన్నది చంద్రబాబా.. జగనా.. లేక ప్రజలా? అన్నది ఇప్పుడే తేల్చలేని పరిస్థితి ఉంది.
-శివాజీ కొంతం (సీనియర్ జర్నలిస్ట్)