రియాలిటీ ముసుగులో వేధింపుల దందా?
బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభానికి ముందే వివాదాలు వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతోంది అనగానే బిగ్ బాస్ నిర్వాహకులపై పలువురు చేసిన ఆరోపణలతో అట్టుడికింది. రియాలిటీ షో ముసుగులో తమపై వేధింపులకు పాల్పడ్డారని యాంకర్ కం జర్నలిస్ట్ శ్వేతారెడ్డి .. నటి గాయత్రి తీవ్రమైన ఆరోపణలు చేయడమే గాక.. కార్యక్రమంతో సంబంధం ఉన్న మధ్య వర్తులపై పోలీస్ కేసులు పెట్టడం సంచలనమైంది. నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి సైతం ఈ వివాదం నేపథ్యంలో రియాలిటీ షోపై రకరకాల ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3 లైవ్ అవుతుందా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్.. నాని హోస్టింగ్ చేసిన తొలి రెండు సీజన్ లకు ఈ తరహా చిక్కులు లేవు. ఆ క్రమంలోనే మూడో సీజన్ కి కింగ్ నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు. వివాదాల నేపథ్యంలో నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని నిన్నటిరోజున హైదరాబాద్ ఉస్మానియా విద్యార్థులు హెచ్చరికలు జారీ చేయడం వాడి వేడిగా చర్చకొచ్చింది. అయితే ఈ కార్యక్రమంపై వస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత? అంటే .. నిప్పు లేనిదే పొగ రాదు కదా!! అంటూ పలువురు విశ్లేషిస్తున్నారు.
టాలీవుడ్ లో లైంగిక వేధింపుల ఫర్వం అలానే ఉంది. మీటూ ఉద్యమం ప్రభావం ఇక్కడ అసలు లేనే లేదని ఓ సినీప్రముఖుడు వ్యాఖ్యానించారు. కాష్ కమిటీ అంటూ శ్రీరెడ్డి వివాదం తర్వాత ఓ కమిటీని వేసినా ఆ తర్వాత అంతా గప్ చుప్ గానే ఉన్నారు. సినిమాల్లో.. టీవీ సీరియళ్లలో అవకాశాలు.. రియాలిటీ షోల్లో ఛాన్సులిప్పిస్తామని మధ్యవర్తులు.. కొందరు ప్రొడక్షన్ మేనేజర్లు.. పీఆర్ మేనేజర్లు ఈ తరహా వలలు విసరడం అన్నది సైలెంట్ గా జరుగుతోంది. అయితే ఇది ఇప్పుడే మొదలైన ప్రక్రియ కాదు. అనాదిగా జరుగుతున్న తంతు ఇదని అతడు వెల్లడించారు. బాలీవుడ్ .. హిందీ టీవీ పరిశ్రమలో `కమిట్‌మెంట్`ను సర్వసాధారణంగా చూసే పరిస్థితి ఉంది. కానీ మన తెలుగులో ఈ కల్చర్ గుట్టు చప్పుడు కాకుండా పాతుకుని ఉందని వెల్లడించారు. డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధమయ్యే కొందరు కేటుగాళ్లు ఎంతకు దిగజారేందుకైనా వెనకాడరు. ఇలాంటి వాళ్ల వల్ల ఈ తరహా అరాచకాలు పెచ్చు మీరుతున్నాయని ఆయన విశ్లేషించడం వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటకు చూపిస్తోంది.