మలయాళ నటుడు కెప్టెన్ రాజు (68) కేరళ రాష్ట్రం కొచ్చిలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు డేవిడ్ రాజు. కొంతకాలం క్రితం.. రాజు అమెరికాకు ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా స్ట్రోక్‌తో బాధపడ్డారు. రాజు తన పరిస్థితిని తెలియజేసిన తరువాత, విమానాన్ని దారి మళ్లించి మస్కట్‌లో లాండ్ చేసింది సిబ్బంది. రాజు ఫ్యామిలీ అభ్యర్థన మేరకు, ఆయన్ను మస్కట్ నుంచి కొచ్చికి చికిత్స నిమిత్తం పంపించారు. ఆ సమయంలో ఆయన కండీషన్ నిలకడగానే ఉంది. సోమవారం అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడిచారు.
రాజు …మొదట్లో భారత సైనిక దళంలో సేవలందించారు.ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. తొలిసారిగా 1981లో ‘రక్తం’ అనే మలయాళ చిత్రంలో నటించారు. అనంతరం మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించారు. తెలుగులో బలిదానం, శత్రువు, రౌడీ అల్లుడు, కొండపల్లి రాజా, జైలర్ గారి అబ్బాయి, గాంఢీవం, మొండి మొగుడు పెంకి పెళ్లాం, మాతో పెట్టుకోకు చిత్రాల్లో ఆయన నటించారు.
తమిళంలో రజనీకాంత్ హీరోగా నటించిన ధర్మత్తిన్ తలైవన్, కమలహాసన్ నటించిన సూరసంహారం, శివాజీ గణేశన్, సత్యరాజ్ నటించిన జల్లికట్టు తదితర 20 చిత్రాల్లో నటించారు. అన్ని భాషల్లో 500 చిత్రాలకు పైగా నటించారు. నెగిటివ్ రోల్స్ లో నటించి ప్రాచుర్యం పొందారు.
అంతేకాదు ఆయన మలయాళంలో ‘ఒరు స్నేహగథా’ (1997)తో దర్శకుడిగా మారారు. అనంతరం ‘పవనాయి 99.99’ (2012) చిత్రానికి దర్శకత్వ వహించడమే కాక ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. కెప్టెన్ రాజుకు భార్య ప్రమీల, కుమారుడు రవిరాజ్ ఉన్నారు. ఆయన మృతికి పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగురాజ్యం ..కెప్టెన్ రాజుకు నివాళులు అర్పిస్తోంది.