బాలీవుడ్ సెల‌బ్రిటీ డ్ర‌గ్స్ గుట్టు వీడియో లీక్

సెల‌బ్రిటీ డ్ర‌గ్స్ గుట్టు వీడియో లీక్

డ్ర‌గ్స్ విచ్చ‌ల‌విడిత‌నంపై తెర‌కెక్కిన బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ఆ సినిమా క‌థాంశం ఎత్తుగ‌డ‌ ఆస‌క్తిక‌రం. పంజాబ్ లో డ్ర‌గ్స్ సంస్కృతి ఏ స్థాయిలో ఉందో ఈ చిత్రంలో చూపించడం అప్ప‌ట్లో వివాదాస్ప‌ద‌మైంది. సెన్సార్ గ‌డ‌ప‌పై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివ‌రికి రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించింది. చిత్ర క‌థానాయ‌కుడు షాహిద్ క‌పూర్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

చాలా కాలం త‌ర్వాత ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఆ సంస్కృతిని గుర్తు చేయ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. పైగా ఈ వీడియోని ఓ ప్ర‌ముఖుడు షేర్ చేయ‌డంతో అది కాస్తా జోరుగా వైర‌ల్ అవుతోంది. అంతే వేగంగా వివాదాస్ప‌దంగానూ మారుతోంది. ఇటీవ‌లే బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఇంట్లో జ‌రిగిన ఆ పార్టీలో స్టార్లు మ‌త్తులో ఊగుతూ క‌నిపించారు. దీపిక ప‌దుకొణే, మ‌లైకా అరోరాఖాన్, అర్జున్ క‌పూర్, ర‌ణ‌బీర్ క‌పూర్, షాహిద్ క‌పూర్, మీర్జా రాజ్‌పుత్‌, వ‌రుణ్ ధావ‌న్, న‌టాషా ద‌లాల్ వంటి స్టార్లు ఈ పార్టీలో ఉన్నారు. ఈ వీడియోపై శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) ఎమ్మెల్యే మజీందర్‌ సింగ్‌ సిర్సా ఓ రేంజులో విరుచుకుప‌డ్డారు. డ్ర‌గ్స్ మ‌త్తులో తూగుతున్న బాలీవుడ్ ని చూశారా.. దీనిని వ్య‌తిరేకిస్తున్నాను! అని ఆయ‌న అన్నారు. స్టార్ల రీల్ లైఫ్ కంటే రియ‌ల్ లైఫ్ ఎంతో విభిన్నంగా ఉంటుంద‌ని స‌ద‌రు ఎమ్మెల్యే విమ‌ర్శించ‌డం ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. పార్టీ వీడియో జోరుగా వైర‌ల్ అవుతుండ‌డంతో యువ‌త‌రంలో హాట్ టాపిక్ అయ్యింది.

రెండేళ్ల క్రితం టాలీవుడ్ లోనూ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బాలీవుడ్ నుంచే ఆ క‌ల్చ‌ర్ దిగుమ‌తి అయ్యింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు దిగుమ‌తి అయ్యే డ్ర‌గ్స్ కి ముంబై.. బెంగ‌ళూరు వంటి మెట్రో న‌గ‌రాల‌తో ఉన్న లింకుల‌పైనా పోలీసులు ఆరా తీసిన సంగ‌తిని గుర్తు చేసుకోవాల్సిందే.