వివాదం లేనిదే పెద్ద సినిమా ఉండదా అనే విధంగా ప్రతీ సారి ఏదో వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా తేజ దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా.. కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటించిన ‘సీత’ టైటిల్‌పై BJYM అభ్యంతరం వ్యక్తం చేసి షాక్ ఇచ్చింది. సినిమాకు ‘సీత’ టైటిల్ పెట్టడంపై ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. ఈ సినిమాలో సీత క్యారెక్టర్‌తో పలు అభ్యంతరక డైలాగులు చెప్పించడంపై వాళ్లు మండిపడుతున్నారు.
‘సీత’ అనే పవిత్రమైన పేరు పెట్టి.. ఈ క్యారెక్టర్‌తో డైరెక్టర్ బూతులు చెప్పించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టైటిల్ పెట్టి దర్శకుడు హిందువుల సెంటిమెంట్‌తో ఆటలు ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద హిందువుల ఆరాధ్యదేవతైన ‘సీత’ పేరుతో ఎలా పడితే అలా సినిమా తీస్తే ఊరుకునేది లేదన్నారు.
వెంటనే డైరెక్టర్ ఈ సినిమా టైటిలైన ‘సీత’ టైటిల్‌తో పాటు.. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్‌తో చెప్పించిన బూతు డైలాగులను తొలగించడంతో పాటు హిందువుల మనోభావాలను కించపరిచినందుకు ఈ సినిమా దర్శక,నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఫిల్మ్ చాంబర్‌లో ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక మెమరాండం సమర్పించారు. ఒకవేళ మేం చెప్పిన డిమాండ్లు ఒప్పుకోకపోతే..ఐపీసీ సెక్షన్ 295(1),502 (2) కింద దర్శక,నిర్మాతలపై కేసు నమోదు చేస్తామన్నారు.
తేజ దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. వీరిద్దరూ జంటగా నటించడం ఇది రెండోసారి. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషించారు.
‘RX 100’ భామ పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇటీవల విడులైన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను ఈనెల 24న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో మన్నారా చోప్రా, తనికెళ్ల భరణి, అభినవ్ గోమటం, అభిమన్యుసింగ్ ముఖ్య పాత్రలు పోషించారు.